Malakajigiri Lok Sabha
-
మోదీ, రేవంత్‌రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వచ్చేదని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్ నుంచే కట్టొద్దని అన్నారు. ప్రస్తుతం తాను వారి మాటలనే గుర్తు చేశానని తెలిపారు. తాను కరెంట్ బిల్లులు కట్టొద్దంటే డిప్యూటీ సీఎం భట్టి తనది విద్వంసకర మనస్తత్వం అని అంటున్నారని మండిపడ్డారు. నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా? అని ప్రశ్నించారు. కరెంటు బిల్లులు కాంగ్రెస్ నేత సోనియా గాంధీకే పంపుదామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఇప్పటినుంచే ఒత్తిడి తేవాలని కార్యకర్తలకు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు వాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామని తెలిపారు. కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లి మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని అన్నారు. పీఎం మోదీకి, సీఎం రేవంత్‌రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు.. మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలని కేటీఆర్ అన్నారు. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ
టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం సాక్షి, హైదరాబాద్: దేశానికి మోడీ.. రాష్ట్రానికి టీడీపీ అవసరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన కేపీహెచ్‌బీ, మూసాపేట, బాలానగర్‌లలో రోడ్‌షోలో, రాత్రి కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో బహిరంగసభలో పాల్గొన్నారు. ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్ను వసూళ్ల పార్టీ, కుటుంబ పార్టీగా అభివర్ణించారు. బెదిరింపులకు పాల్పడితే తెలుగు తమ్ముళ్లు ఊరుకోరంటూ.. కేసీఆర్ ఖబడ్దార్ అని హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ నేతలను తయారుచేసింది తామేననీ, గురువులకు పంగనామం పెట్టిన ఘనులు టీఆర్ఎస్ నేతలని పరోక్షంగా కేసీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను నిజాం నవాబులు అభివృద్ధి చేస్తే, సైబరాబాద్, హైటెక్సిటీలను తమ హయాంలో అభివృద్ధిచేసి ప్రపంచస్థాయిలో నిలబెట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడపిల్లలు ఒక ఫోన్‌కాల్ చేస్తే ఐదు నిమిషాల్లో రక్షణ కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను తెస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్ధి సి.మల్లారెడి,్డ కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ అభ్యర్థులు మాధవరం కృష్ణారావు, వివేకానందగౌడ్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'ఆప్'లో మల్కాజిగిరి చిచ్చు!
దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి రాజకీయపార్టీల్లో చిచ్చు రేపుతోంది. మల్కాజిగిరి చిచ్చు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకే పరిమితం కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కూడా చుట్టుకుంది. అవినీతి రాజకీయాలను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత కలహాలు ఆపార్టీని బజారును పడేశాయి. తొలుత చందనా చక్రవర్తిని అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దాంతో చందనా చక్రవర్తి ప్రచార కార్యకలాపాలకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే అనూహ్యంగా మల్కాజిగిరి లోకసభ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు మనవడు ఎన్ వీ సుధా కిరణ్ పేరు తెరపైకి వచ్చింది. దాంతో పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పోటి నుంచి తప్పుకునేందుకు చందనా చక్రవర్తి నిర్ణయం తీసుకుంది. చందనా నిర్ణయంతో పార్టీలో గందరగోళానికి దారి తీసింది. చందనా వర్గం ఆందోళన చేపట్టి.. పార్టీ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది. కార్యకర్తల నిరసన తో మేల్కొన్న పార్టీ అధినాయకత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగింది. మల్కాజిగిరి సీటును సొంతం చేసుకున్న సుధా కిరణ్ ఆసీటుపై నెలకొన్న వివాదంపై స్పందించారు. 'పార్టీ ఆరంభం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీతో కొనసాగుతున్నాను. సభ్యత్వం కూడా తీసుకున్నాను. పార్టీ అభ్యున్నతి కోసం నిర్విరామంగా పనిచేస్తున్నాను. నేను పార్టీ అభ్యర్ధిగా పోటి చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దాంతో పోటీకి సిద్ధమయ్యాను' అని సుధా కిరణ్ తెలిపారు. పీవీ కుటుంబమంతా కాంగ్రెస్ కు విధేయులుగా ఉంటే మీరు ఆమ్ ఆద్మీ పార్టీ లో ఎందుకు చేరారనే ప్రశ్నకు 'పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం' అని పీవీ కుమార్తే శారదా దేవి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, గత కొద్దికాలంగా పార్టీకి సేవలందిస్తున్న వారిని కాదని, పార్టీకి సంబంధం లేని వారికి టికెట్ ఎలా కేటాయిస్తారని, మల్కాజిగిరి టికెట్ ఆమెకే కేటాయించాలని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట చందనా చక్రవర్తి మద్దతుదారులు ధర్నా చేపట్టారు. సంబంధం లేని వారికి టికెట్ కేటాయిస్తే పార్టీ ఎలా మనగడ సాధిస్తుందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ అంతర్గత కలహాలకు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువేమి కాదు అని ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.