టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: దేశానికి మోడీ.. రాష్ట్రానికి టీడీపీ అవసరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన కేపీహెచ్‌బీ, మూసాపేట, బాలానగర్‌లలో రోడ్‌షోలో, రాత్రి కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో బహిరంగసభలో పాల్గొన్నారు. ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ.. టీఆర్‌ఎస్‌ను వసూళ్ల పార్టీ, కుటుంబ పార్టీగా అభివర్ణించారు. బెదిరింపులకు పాల్పడితే తెలుగు తమ్ముళ్లు ఊరుకోరంటూ.. కేసీఆర్ ఖబడ్దార్ అని హెచ్చరించారు.
టిఆర్‌ఎస్ పార్టీ నేతలను తయారుచేసింది తామేననీ, గురువులకు పంగనామం పెట్టిన ఘనులు టీఆర్‌ఎస్ నేతలని పరోక్షంగా కేసీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను నిజాం నవాబులు అభివృద్ధి చేస్తే, సైబరాబాద్, హైటెక్‌సిటీలను తమ హయాంలో అభివృద్ధిచేసి ప్రపంచస్థాయిలో నిలబెట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడపిల్లలు ఒక ఫోన్‌కాల్ చేస్తే ఐదు నిమిషాల్లో రక్షణ కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను తెస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్ధి సి.మల్లారెడి,్డ కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ అభ్యర్థులు మాధవరం కృష్ణారావు, వివేకానందగౌడ్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ వసూళ్ల పార్టీ
Published Sun, Apr 13 2014 2:46 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement