Malaysia Grand Prix Masters
-
సైనా మెరిసె...
-
సైనా మెరిసె...
మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ సొంతం సారావక్ (మలేసియా): కొత్త ఏడాదిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి చాంపియన్‌గా అవతరించింది. గత నవంబరులో మోకాలి గాయం నుంచి కోలుకున్నాక సైనా నెగ్గిన తొలి అంతర్జాతీయ టైటిల్ ఇదే కావడం విశేషం. 46 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 22–20, 22–20తో ప్రపంచ 67వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. గత ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన తర్వాత సైనా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం గమనార్హం. సైనా కెరీర్లో ఇది తొమ్మిదో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ కాగా ఓవరాల్‌గా 23వ టైటిల్. విజేతగా నిలిచిన సైనాకు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షల 12 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెరీర్లో తొలిసారి పోర్న్‌పవీతో ముఖాముఖిగా ఆడిన ప్రపంచ పదో ర్యాంకర్ సైనాకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. 19–20 స్కోరు వద్ద గేమ్ పాయింట్ కాచుకున్న సైనా వరుసగా మూడు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సైనా పలుమార్లు ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు 20–16 వద్ద సైనా వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోవడంతో స్కోరు 20–20తో సమమైంది. అయితే కీలకదశలో తేరుకున్న సైనా వరుసగా రెండు పాయింట్లు నెగ్గి విజయంతోపాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ సైనా తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. మోకాలికి శస్త్ర చికిత్స జరిగిన సమయం నుంచి టైటిల్ గెలిచిన ఈ క్షణం వరకు నా ప్రయాణం ఎంతో కఠినంగా, ఉద్వేగంగా సాగింది. క్లిష్ట సమయంలో నన్ను ప్రోత్సహించిన కోచ్‌లు విమల్ కుమార్, ఉమేంద్ర రాణాలకు కృతజ్ఞతలు. గాయం నుంచి కోలుకునేందుకు సహకరించిన నా ఫిజియోలు హీత్ మాథ్యూస్, చందన్ పొద్దార్, అరవింద్ నిగమ్‌లకు ఈ టైటిల్ అంకితం ఇస్తున్నాను. – సైనా నెహ్వాల్ -
తొలి రౌండ్లోనే సిరిల్, రాహుల్ ఓటమి
సారావక్ (మలేసియా): మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ఆటగాళ్లు సిరిల్ వర్మ, చిట్టబోయిన రాహుల్ యాదవ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. భారత్‌కే చెందిన హర్షీల్ దాని, ప్రతుల్ జోషి, హేమంత్ గౌడ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో సిరిల్ వర్మ 10–21, 21–18, 17–21తో పనావత్ తోంగ్‌నువామ్ (థాయ్‌లాండ్) చేతిలో, రాహుల్ యాదవ్ 16–21, 11–21తో సుయె సువాన్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. హర్షీల్ 21–19, 21–17తో జి జియా లీ (మలేసియా)పై, ప్రతుల్ జోషి 15–21, 21–16, 24–22తో జిన్ రీ రియాన్ ఎన్జీ (సింగపూర్)పై, హేమంత్ 21–14, 21–15తో యెహిజకిల్ మైనాకి (ఇండోనేసియా)పై విజయం సాధించారు. -
సింధు శుభారంభం
పెనాంగ్:మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-17, 21-16తో సబ్రినా జాక్వెట్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, అజయ్ జయరామ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో శ్రీకాంత్ 21-16, 21-15తో క్రిస్టినా జొనాథన్ (ఇండోనేసియా)పై, జయరామ్ 21-17, 21-17తో పీటర్ కౌకుల్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 14-21, 21-10, 18-21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో; సమీర్ వర్మ 21-7, 13-21, 16-21తో గో సువాన్ హువాట్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-14, 14-21, 25-23తో మీ కువాన్ చౌ-లీ మెంగ్ యీన్ (మలేసియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.