Malini
-
రోజూ సాధన చేస్తే యోగమే..
ఫ్యాషన్ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల పాటు వెలిగిన మాలిని రమణి ఫ్యాషన్ ప్రపంచానికి వీడ్కోలు పలికి యోగా గురువుగా మారింది.ఇక యోగా గురువుగానే ఉండిపోతానంటోంది మాలిని. గోవాలోని ఈ డిజైనర్ ఫ్యాషన్హౌస్లు ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఇంకా తెరుచుకోవడం లేదు. డిజైనింగ్‌కు అవసరమైన మెటీరియల్‌కు తగిన షాపులు తెరవకపోవడం, టైలర్లు అందుబాటులో లేకపోవడంతో డిజైనింగ్ నుండి మాలిని దూరమైంది. ఇప్పుడు యోగా గురువుగా కొత్తగా ఏదో ఒకటి చేస్తూ తన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. ‘ప్రస్తుతం కరోనా యుగంలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో బయటకు వెళ్లలేం. పార్టీకోసం అందమైన దుస్తులను రూపొందించడానికి ఇది సమయమూ కాదు. అందుకే యోగాను ఎంచుకున్నాను’ అంటోంది మాలిని. అంతర్జాతీయ గుర్తింపు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం, 2000 సంవత్స రంలో రమణి తన కెరీర్‌ను ఇండియన్ ప్రిన్సెస్ కలెక్షన్‌తో ప్రారంభించింది. ఇరవై ఏళ్ళలో ఆమె ఫ్యాషన్‌హౌస్ విదేశీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. ఈ ప్రసిద్ధ డిజైనర్ ప్రముఖ ఖాతాదారులలో బాలీవుడ్, టాలీవుడ్ తారలూ ఉన్నారు. సారా జేన్ డియాజ్, తమన్నా భాటియా, శిల్పా శెట్టి, తాప్సీ పన్నూ, ఇషా గుప్తా, నర్గిస్ ఫఖ్రీ.. వంటివారెందరో ఉన్నారు. పారిస్ నటి మీడియా పర్సనాలిటీ హిల్టన్ మాలిని రూపొందించిన చీరను ధరించడంతో అంతర్జాతీయ శైలి ఐకాన్‌గా గుర్తింపు పొందింది. ఆరేళ్ల వయసులోనే యోగాభ్యాసం.. ఆరేళ్ల వయసులో తన తల్లి యోగా పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిన నాటి నుంచి మాలిని యోగా నేర్చుకోవడం ప్రారంభించింది. ఆ పుస్తకంలో పేర్కొన్న యోగాసనాలను సరదా సరదా భంగిమలతో సాధన చేయడం ప్రారంభించింది. ‘ఒక విద్యార్థి నుంచి యోగాగురువుగా మారే ప్రయాణం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింద’ని మాలిని చెబుతుంది. భావోద్వేగాల అదుపు యోగాను రోజూ సాధన చేస్తే యోగమే అంటున్న మాలిని రమణి యోగా నిపుణులు గుర్ముఖ్ ఖల్సా నుండి శిక్షణ తీసుకుంది. తన గురువు గుర్ముఖ్ గురించి చెబుతూ‘ఆమె నుండి యోగా నేర్చుకున్న అనుభవం అద్భుతమైనది. యోగాతో నా భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకున్నాను. యోగాలో ధ్యానానికి అత్యున్నత హోదా ఉంది. నా జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడంలో యోగా ప్రధాన పాత్ర పోషించింది. యోగ ప్రతిపనిని సరిగ్గా చేయటానికి నాకు బలాన్ని ఇస్తుంది. ఇక నుంచి యోగానే శ్వాసిస్తూ, యోగాలో శిక్షణ ఇస్తూ.. యోగా గురువుగా ఉండిపోతాను’ అని చెబుతోంది కరోనా ఎందరి జీవితాలనో మార్చబోతోంది. చేస్తున్న పనులను ఆపేసి కొత్తమార్గాన్ని సృష్టిస్తోంది. ఆ మార్గం అందరినీ ఆరోగ్యం వైపుగా మళ్లించడానికి సిద్ధమవడం సంతోషకరం. -
జర్నలిస్ట్ పాత్రలో శ్రద్ధాదాస్
హీరోయిన్ శ్రద్ధాదాస్ 'పిఎస్వి గరుడవేగ 126.18ఎం' సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం . ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పాత బస్తీలో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రాజశేఖర్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్లోనే పాతిక కోట్లకు పైగా బడ్జెట్‌తో తొలిసారిగా ఈ సినిమా రూపొందుతుంది. మెయిన్ విలన్ జార్జ్ పాత్రలో కిషోర్ నటిస్తున్నాడు. హీరోయిన్ పూజా కుమార్, రాజశేఖర్ భార్య పాత్రలో నటిస్తుంది. గుంటూరు టాకీస్ చిత్రంలో హిలేరియస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన శ్రద్ధాదాస్ ఈ సినిమాలో కాంటెంపరరీ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి స్థాయికి రావాలని కలలు కనే ఓ యంగ్ జర్నలిస్ట్ మనాలిగా బెంగాలీ బ్యూటీ శ్రద్ధాదాస్ అలరించనుంది. శ్రద్ధాదాస్ రియల్ లైఫ్ లోనూ జర్నలిజం స్టూడెంట్ కావడంతో మనాలి పాత్రలో ఒదిగిపోయింది. అదిత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. నాజర్, చరణ్ దీప్ తదితరులు రాజశేఖర్ ఎన్ఐఎ టీం సభ్యులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
విధిపై విజేత
నేడు అంతర్జాతీయ వికలాంగుల దినం విధి వైపరీత్యం జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఎదురొడ్డే ధైర్యం ఉంటే శారీరక వైకల్యాన్నే కాదు... పరిహసించిన విధినీ జయించవచ్చు. అక్షరాలా అదే నిరూపించింది మాలినీ భండారీ. అగ్ని ప్రమాదంతో అంగవైకల్యం బారిన పడ్డా... ఆత్మవిశ్వాసంతో కోలుకొని, అకుంఠిత దీక్షతో జీవితాన్ని దిద్దుకుంది. కర్నాటక రాష్ట్రంలో ఉడిపికి సమీపాన ఉన్న అంబలపూడిలో ‘సవిత సమాజ కో ఆపరేటివ్ బ్యాంకు’. అందులోని పలువురు ఉద్యోగుల మధ్య ఒక అమ్మాయి మీద అందరి దృష్టీ కేంద్రీకృతమవుతోంది. ఆమె అందరికి మల్లే కంప్యూటర్ మీద చాకచక్యంగా పని చేసుకుంటూ పోతోంది. అయితే, గమనిస్తే ఆమెకు చేతులు సరిగా లేవు. మణికట్టు వరకే ఉన్నాయి. బ్యాంకుకు వచ్చిన వాళ్లంతా ఆమె పట్ల కొంత సానుభూతితోనూ, మరికొందరు అత్యంత ఆసక్తిగానూ చూస్తున్నారు. మాలిని మాత్రం ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో పని చేసుకుపోతోంది. ఆమెకు చేతులు పుట్టుకతోనే లేవా, ప్రమాదంలో పోయాయా అనే ప్రశ్నలు వారి మెదళ్లలో. ఇంతకీ అసలేం జరిగిందంటే... మాలినిది ఉడిపికి దగ్గరలో కానాజర్ గ్రామం. ధర్మపాల, పుష్పవతి దంపతుల ఆరుగురు సంతానంలో షాలిని, మాలిని కవల పిల్లలు. ఏడాదిన్నర వయసులో ఇద్దరూ ఆడుకుంటూ ఉండగా మాలిని పట్టు తప్పి, పక్కనే మండుతున్న గాడి పొయ్యిలో పడిపోయింది. తల్లితండ్రులు వెంటనే తేరుకుని బిడ్డ ప్రాణాలను కాపాడగలిగారు. కానీ రెండు చేతులూ కాలిపోయాయి. తల్లితండ్రుల అజాగ్రత్తకు డాక్టరు నిర్లక్ష్యం కూడా తోడయింది. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన డాక్టరు చేసిన పొరపాటు కారణంగా ఆమె అరచేతులు ఆకారాన్ని కోల్పోయి కాలిన మాంసపు ముద్దల్లా మారిపోయాయి. పుట్టుకతో అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ విధి వైపరీత్యంతో చేతులను కోల్పోయింది మాలిని. ఈ పాపాయిని పెంచడం ఎలాగో తెలియని అయోమయం ఆ అమ్మానాన్నలది. ఎవరో ఇచ్చిన సలహా మేరకు కానాజర్ గ్రామంలోనే ఉన్న క్రైస్తవ మిషనరీ నిర్వహిస్తున్న లార్డ్స్ హయ్యర్ ప్రైమరీ స్కూల్లో చేర్చారు. ఆమె అక్షరాలు ముత్యాలే! అంగవైకల్యం ఎంత బాధాకరమో అక్కడే తెలిసి వచ్చింది మాలినికి. తోటి పిల్లలతో సమానంగా అన్నింట్లో చురుగ్గా ఉంటోంది. కానీ పలక, బలపం పట్టుకోలేకపోతే అక్షరం వచ్చేదెలా? అక్షరాలు దిద్దుతున్న తోటి పిల్లల వైపు బెంగగా చూస్తూ కూర్చునేది. బహుశా దేవుడు తన పొరపాటును తానే సరిదిద్దుతాడు కాబోలు. విలియమ్ మాస్టారి రూపంలో మాలినికి సహాయం చేశాడు. పలకను ఒళ్లో పెట్టుకుని, రెండు మణికట్టుల మధ్య బలపాన్ని పెట్టుకుని రాయడం నేర్పించారాయన. ‘అలా తొలి అక్షరం రాసిన రోజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అంటూ మెరుస్తున్న కళ్లతో చెప్తుంది మాలిని. ఇక విలియం మాస్టార్ అయితే ‘మాలిని రాసిన అక్షరాలను చూసి చేతులు చక్కగా ఉన్న వాళ్లు సిగ్గు పడాల్సిందే’ అని మెచ్చుకుంటారు. ఇప్పుడామె బి.ఎ, కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసి కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం చేస్తోంది. గవర్నర్ నుంచి పురస్కారం! ఒక వైపు అంగ వైకల్యం, మరో వైపు పేదరికం. ఈ రెండింటినీ అధిగమించి జీవితంలో నిలబడిన ధీరోదాత్త బాలికగా 2004లో అప్పటి కర్నాటక గవర్నర్ టి.ఎన్. చతుర్వేది చేతుల మీదుగా పురస్కారాన్నీ, పదివేల రూపాయల నగదు బహుమతినీ అందుకున్నదా అమ్మాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి జీవితాన్ని నిలబెట్టుకోవడాన్ని ఆమెతో ప్రస్తావించినప్పుడు ‘‘అవసరం వచ్చినప్పుడు అన్నీ అవే వచ్చేస్తాయి’’ అని నవ్వుతూ బదులిస్తుంది మాలిని. ‘‘శారీరక వైకల్యాన్ని అధిగమించాలంటే ముందు మానసికంగా వైకల్యం లేకుండా చూసుకోవాలి. మనసు దిటవు చేసుకుంటే శారీరక వైకల్యాన్ని జయించవచ్చు’’ అని వికలాంగులకు ధైర్యం చెప్తుంటుంది. మాలిని ఎంతోమందికి ఆదర్శమవుతోంది అందుకే.