విధిపై విజేత | Today is the International Day of Persons with Disabilities | Sakshi
Sakshi News home page

విధిపై విజేత

Published Tue, Dec 2 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

విధిపై విజేత

విధిపై విజేత

నేడు అంతర్జాతీయ వికలాంగుల దినం
 
విధి వైపరీత్యం జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఎదురొడ్డే ధైర్యం ఉంటే శారీరక వైకల్యాన్నే కాదు... పరిహసించిన విధినీ జయించవచ్చు. అక్షరాలా అదే నిరూపించింది మాలినీ భండారీ. అగ్ని ప్రమాదంతో అంగవైకల్యం బారిన పడ్డా... ఆత్మవిశ్వాసంతో కోలుకొని, అకుంఠిత దీక్షతో జీవితాన్ని దిద్దుకుంది.
 
కర్నాటక రాష్ట్రంలో ఉడిపికి సమీపాన ఉన్న అంబలపూడిలో ‘సవిత సమాజ కో ఆపరేటివ్ బ్యాంకు’. అందులోని పలువురు ఉద్యోగుల మధ్య ఒక అమ్మాయి మీద అందరి దృష్టీ కేంద్రీకృతమవుతోంది. ఆమె అందరికి మల్లే కంప్యూటర్ మీద చాకచక్యంగా పని చేసుకుంటూ పోతోంది. అయితే, గమనిస్తే ఆమెకు చేతులు సరిగా లేవు. మణికట్టు వరకే ఉన్నాయి. బ్యాంకుకు వచ్చిన వాళ్లంతా ఆమె పట్ల కొంత సానుభూతితోనూ, మరికొందరు అత్యంత ఆసక్తిగానూ చూస్తున్నారు. మాలిని మాత్రం ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో పని చేసుకుపోతోంది. ఆమెకు చేతులు పుట్టుకతోనే లేవా, ప్రమాదంలో పోయాయా అనే ప్రశ్నలు వారి మెదళ్లలో. ఇంతకీ అసలేం జరిగిందంటే...
 
మాలినిది ఉడిపికి దగ్గరలో కానాజర్ గ్రామం. ధర్మపాల, పుష్పవతి దంపతుల ఆరుగురు సంతానంలో షాలిని, మాలిని కవల పిల్లలు. ఏడాదిన్నర వయసులో ఇద్దరూ ఆడుకుంటూ ఉండగా మాలిని పట్టు తప్పి, పక్కనే మండుతున్న గాడి పొయ్యిలో పడిపోయింది. తల్లితండ్రులు వెంటనే తేరుకుని బిడ్డ ప్రాణాలను కాపాడగలిగారు. కానీ రెండు చేతులూ కాలిపోయాయి. తల్లితండ్రుల అజాగ్రత్తకు డాక్టరు నిర్లక్ష్యం కూడా తోడయింది. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన డాక్టరు చేసిన పొరపాటు కారణంగా ఆమె అరచేతులు ఆకారాన్ని కోల్పోయి కాలిన మాంసపు ముద్దల్లా మారిపోయాయి. పుట్టుకతో అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ విధి వైపరీత్యంతో చేతులను కోల్పోయింది మాలిని. ఈ పాపాయిని పెంచడం ఎలాగో తెలియని అయోమయం ఆ అమ్మానాన్నలది. ఎవరో ఇచ్చిన సలహా మేరకు కానాజర్ గ్రామంలోనే ఉన్న క్రైస్తవ మిషనరీ నిర్వహిస్తున్న లార్డ్స్ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌లో చేర్చారు.

ఆమె అక్షరాలు ముత్యాలే!
 
అంగవైకల్యం ఎంత బాధాకరమో అక్కడే తెలిసి వచ్చింది మాలినికి. తోటి పిల్లలతో సమానంగా అన్నింట్లో చురుగ్గా ఉంటోంది. కానీ పలక, బలపం పట్టుకోలేకపోతే అక్షరం వచ్చేదెలా? అక్షరాలు దిద్దుతున్న తోటి పిల్లల వైపు బెంగగా చూస్తూ కూర్చునేది. బహుశా దేవుడు తన పొరపాటును తానే సరిదిద్దుతాడు కాబోలు. విలియమ్ మాస్టారి రూపంలో మాలినికి సహాయం చేశాడు. పలకను ఒళ్లో పెట్టుకుని, రెండు మణికట్టుల మధ్య బలపాన్ని పెట్టుకుని రాయడం నేర్పించారాయన. ‘అలా తొలి అక్షరం రాసిన రోజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అంటూ మెరుస్తున్న కళ్లతో చెప్తుంది మాలిని. ఇక విలియం మాస్టార్ అయితే ‘మాలిని రాసిన అక్షరాలను చూసి చేతులు చక్కగా ఉన్న వాళ్లు సిగ్గు పడాల్సిందే’ అని మెచ్చుకుంటారు. ఇప్పుడామె బి.ఎ, కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసి కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం చేస్తోంది.
 
గవర్నర్ నుంచి పురస్కారం!

ఒక వైపు అంగ వైకల్యం, మరో వైపు పేదరికం. ఈ రెండింటినీ అధిగమించి జీవితంలో నిలబడిన ధీరోదాత్త బాలికగా 2004లో అప్పటి కర్నాటక గవర్నర్ టి.ఎన్. చతుర్వేది చేతుల మీదుగా పురస్కారాన్నీ, పదివేల రూపాయల నగదు బహుమతినీ అందుకున్నదా అమ్మాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి జీవితాన్ని నిలబెట్టుకోవడాన్ని ఆమెతో ప్రస్తావించినప్పుడు ‘‘అవసరం వచ్చినప్పుడు అన్నీ అవే వచ్చేస్తాయి’’ అని నవ్వుతూ బదులిస్తుంది మాలిని. ‘‘శారీరక వైకల్యాన్ని అధిగమించాలంటే ముందు మానసికంగా వైకల్యం లేకుండా చూసుకోవాలి. మనసు దిటవు చేసుకుంటే శారీరక వైకల్యాన్ని జయించవచ్చు’’ అని వికలాంగులకు ధైర్యం చెప్తుంటుంది. మాలిని ఎంతోమందికి ఆదర్శమవుతోంది అందుకే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement