International Day of Persons with Disabilities
-
దివ్యాంగులకు ప్రభుత్వం పూర్తి భరోసా
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు పూర్తి భరోసా ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రవీంద్రభారతిలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక పెన్షన్లను దివ్యాంగులకు అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే పలు సంక్షేమ పథకాలు, క్రీడారంగం, పలు విభాగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా వికలాంగులకు రూ.18 కోట్లతో ఏటా పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలనే ప్రతిపాదనను మంత్రిమండలికి సిఫారసు చేస్తానని కొప్పుల హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వికలాంగులకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజ్ పాల్గొన్నారు. -
వెదుళ్లపల్లిలో బ్రెయిలీ ప్రెస్ ప్రారంభం
బాపట్ల టౌన్ : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి సమీపంలోని బధిరుల పాఠశాలలో బ్రెయిలీ ప్రెస్‌ను ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా రూ.1.65 కోట్ల వ్యయంతో మిషనరీతోపాటు ప్రెస్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ముద్రించే పుస్తకాలను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు అంధుల విద్యాసంస్థలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గుంటూరులో త్వరలో రూ.1.35 కోట్లతో నూతన భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అవి పూర్తయిన తర్వాత ఈ ప్రెస్‌ను గుంటూరుకు మారుస్తామన్నారు. కార్యక్రమంలో బ్రెయిలీ లిపి ప్రాజెక్ట్ అధికారి డి.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఎం.రమేష్‌బాబు, ఎంపీపీ మానం విజేత, మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లీశ్వరి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు తోట నారాయణ, బదిరుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.అరుణ తదితరులున్నారు. -
విధిపై విజేత
నేడు అంతర్జాతీయ వికలాంగుల దినం విధి వైపరీత్యం జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఎదురొడ్డే ధైర్యం ఉంటే శారీరక వైకల్యాన్నే కాదు... పరిహసించిన విధినీ జయించవచ్చు. అక్షరాలా అదే నిరూపించింది మాలినీ భండారీ. అగ్ని ప్రమాదంతో అంగవైకల్యం బారిన పడ్డా... ఆత్మవిశ్వాసంతో కోలుకొని, అకుంఠిత దీక్షతో జీవితాన్ని దిద్దుకుంది. కర్నాటక రాష్ట్రంలో ఉడిపికి సమీపాన ఉన్న అంబలపూడిలో ‘సవిత సమాజ కో ఆపరేటివ్ బ్యాంకు’. అందులోని పలువురు ఉద్యోగుల మధ్య ఒక అమ్మాయి మీద అందరి దృష్టీ కేంద్రీకృతమవుతోంది. ఆమె అందరికి మల్లే కంప్యూటర్ మీద చాకచక్యంగా పని చేసుకుంటూ పోతోంది. అయితే, గమనిస్తే ఆమెకు చేతులు సరిగా లేవు. మణికట్టు వరకే ఉన్నాయి. బ్యాంకుకు వచ్చిన వాళ్లంతా ఆమె పట్ల కొంత సానుభూతితోనూ, మరికొందరు అత్యంత ఆసక్తిగానూ చూస్తున్నారు. మాలిని మాత్రం ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో పని చేసుకుపోతోంది. ఆమెకు చేతులు పుట్టుకతోనే లేవా, ప్రమాదంలో పోయాయా అనే ప్రశ్నలు వారి మెదళ్లలో. ఇంతకీ అసలేం జరిగిందంటే... మాలినిది ఉడిపికి దగ్గరలో కానాజర్ గ్రామం. ధర్మపాల, పుష్పవతి దంపతుల ఆరుగురు సంతానంలో షాలిని, మాలిని కవల పిల్లలు. ఏడాదిన్నర వయసులో ఇద్దరూ ఆడుకుంటూ ఉండగా మాలిని పట్టు తప్పి, పక్కనే మండుతున్న గాడి పొయ్యిలో పడిపోయింది. తల్లితండ్రులు వెంటనే తేరుకుని బిడ్డ ప్రాణాలను కాపాడగలిగారు. కానీ రెండు చేతులూ కాలిపోయాయి. తల్లితండ్రుల అజాగ్రత్తకు డాక్టరు నిర్లక్ష్యం కూడా తోడయింది. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన డాక్టరు చేసిన పొరపాటు కారణంగా ఆమె అరచేతులు ఆకారాన్ని కోల్పోయి కాలిన మాంసపు ముద్దల్లా మారిపోయాయి. పుట్టుకతో అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ విధి వైపరీత్యంతో చేతులను కోల్పోయింది మాలిని. ఈ పాపాయిని పెంచడం ఎలాగో తెలియని అయోమయం ఆ అమ్మానాన్నలది. ఎవరో ఇచ్చిన సలహా మేరకు కానాజర్ గ్రామంలోనే ఉన్న క్రైస్తవ మిషనరీ నిర్వహిస్తున్న లార్డ్స్ హయ్యర్ ప్రైమరీ స్కూల్లో చేర్చారు. ఆమె అక్షరాలు ముత్యాలే! అంగవైకల్యం ఎంత బాధాకరమో అక్కడే తెలిసి వచ్చింది మాలినికి. తోటి పిల్లలతో సమానంగా అన్నింట్లో చురుగ్గా ఉంటోంది. కానీ పలక, బలపం పట్టుకోలేకపోతే అక్షరం వచ్చేదెలా? అక్షరాలు దిద్దుతున్న తోటి పిల్లల వైపు బెంగగా చూస్తూ కూర్చునేది. బహుశా దేవుడు తన పొరపాటును తానే సరిదిద్దుతాడు కాబోలు. విలియమ్ మాస్టారి రూపంలో మాలినికి సహాయం చేశాడు. పలకను ఒళ్లో పెట్టుకుని, రెండు మణికట్టుల మధ్య బలపాన్ని పెట్టుకుని రాయడం నేర్పించారాయన. ‘అలా తొలి అక్షరం రాసిన రోజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అంటూ మెరుస్తున్న కళ్లతో చెప్తుంది మాలిని. ఇక విలియం మాస్టార్ అయితే ‘మాలిని రాసిన అక్షరాలను చూసి చేతులు చక్కగా ఉన్న వాళ్లు సిగ్గు పడాల్సిందే’ అని మెచ్చుకుంటారు. ఇప్పుడామె బి.ఎ, కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసి కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం చేస్తోంది. గవర్నర్ నుంచి పురస్కారం! ఒక వైపు అంగ వైకల్యం, మరో వైపు పేదరికం. ఈ రెండింటినీ అధిగమించి జీవితంలో నిలబడిన ధీరోదాత్త బాలికగా 2004లో అప్పటి కర్నాటక గవర్నర్ టి.ఎన్. చతుర్వేది చేతుల మీదుగా పురస్కారాన్నీ, పదివేల రూపాయల నగదు బహుమతినీ అందుకున్నదా అమ్మాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి జీవితాన్ని నిలబెట్టుకోవడాన్ని ఆమెతో ప్రస్తావించినప్పుడు ‘‘అవసరం వచ్చినప్పుడు అన్నీ అవే వచ్చేస్తాయి’’ అని నవ్వుతూ బదులిస్తుంది మాలిని. ‘‘శారీరక వైకల్యాన్ని అధిగమించాలంటే ముందు మానసికంగా వైకల్యం లేకుండా చూసుకోవాలి. మనసు దిటవు చేసుకుంటే శారీరక వైకల్యాన్ని జయించవచ్చు’’ అని వికలాంగులకు ధైర్యం చెప్తుంటుంది. మాలిని ఎంతోమందికి ఆదర్శమవుతోంది అందుకే. -
వంద శాతం వైకల్యం ఉంటే రూ.వెయ్యి పింఛన్: కిరణ్‌కుమార్‌రెడ్డి
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలో సీఎం సాక్షి, హైదరాబాద్: నూరు శాతం వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. వారికి ఇప్పటివరకు నెలకు రూ.500 ఇస్తున్న పింఛన్‌ను రూ.1000కి పెంచుతున్నామని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడిం చారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారమిక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రవుంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికలాంగులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.లక్ష వరకు రుణం ఇస్తామని చెప్పారు. పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు ఉపయుక్తంగా ఉండే విధంగా 3జీ ఫోన్లు అందుబాటులోనికి తెస్తామని, ఏఏవై కార్డులేని వికలాంగులందరికీ కార్డులు అందజేస్తామని, వడ్టీలేని రుణాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. డిగ్రీలో ఫస్ట్‌క్లాస్ వచ్చిన విద్యార్థులు పీజీలో చేరితే వారికి మోటార్ సైకిళ్లు అందించే అంశాన్ని పరిశీలిస్తామని, స్వయం ఉపాధి పథకంలో భాగంగా వికలాం గుల కోసం త్వరలో మంచి పథకాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తాము ఎవరికీ తక్కువ కాదన్న మనోధైర్యంతో వికలాంగులు ముందుకెళ్లేలా అండగా ఉంటామని చెప్పారు.