వంద శాతం వైకల్యం ఉంటే రూ.వెయ్యి పింఛన్: కిరణ్‌కుమార్‌రెడ్డి
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలో సీఎం
సాక్షి, హైదరాబాద్: నూరు శాతం వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. వారికి ఇప్పటివరకు నెలకు రూ.500 ఇస్తున్న పింఛన్‌ను రూ.1000కి పెంచుతున్నామని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడిం చారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారమిక్కడ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రవుంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికలాంగులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.లక్ష వరకు రుణం ఇస్తామని చెప్పారు.
పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు ఉపయుక్తంగా ఉండే విధంగా 3జీ ఫోన్లు అందుబాటులోనికి తెస్తామని, ఏఏవై కార్డులేని వికలాంగులందరికీ కార్డులు అందజేస్తామని, వడ్టీలేని రుణాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. డిగ్రీలో ఫస్ట్‌క్లాస్ వచ్చిన విద్యార్థులు పీజీలో చేరితే వారికి మోటార్ సైకిళ్లు అందించే అంశాన్ని పరిశీలిస్తామని, స్వయం ఉపాధి పథకంలో భాగంగా వికలాం గుల కోసం త్వరలో మంచి పథకాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తాము ఎవరికీ తక్కువ కాదన్న మనోధైర్యంతో వికలాంగులు ముందుకెళ్లేలా అండగా ఉంటామని చెప్పారు.