malkajgiri police
-
Hyderabad: రూ.10 లక్షల మోసం.. ఉప్పల్‌లో నకిలీ జడ్జి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో నకిలీ జడ్జిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. జడ్జి అవతారమెత్తి వివాదాస్పద భూములను పరిష్కరిస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను మల్కాజిగిర ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఉప్పల్ పీఎస్‌లో మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ డిగ్రీ చదవి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి రామంతాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో గతంలో దొంగతనాలు, బైక్ చోరీలు చేస్తూ జైలుకు వెళ్లి వచ్చాడు. అతనిపై పోలీసులు పీడీ చట్టం కూడా ఉపయోగించారు. తరువాత హైకోర్టులో వివాదాస్పద భూముల కేసులు త్వరగా పరిష్కరిస్తామనిఫేస్బుక్లో ఓ పేజ్ రూపొందించాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన గార్లపాటి సోమిరెడ్డి అనే వ్యక్తి దగ్గర పదిలక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడు. కేసు పరిష్కారం కాకపోవడంతో బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు.. నకిలీ జడ్జి నామాలా నరేందర్‌తోపాటు అతని వెంట గన్‌మెన్‌గా తిరుగుతూ నిందితుడికి సహకరిస్తున్న చిక్కం మధుసూదన రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి తెలిపారు. నిందితుల వద్ద అనుమతి లేని ఓ పిస్టల్ , అయిదు రౌండ్ల బుల్లెట్లు, ఒక కారు, ఫేక్ జడ్జి ఐడి కార్డు , రూ. 7500 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్సిజన్ సిలిండర్ల దందా
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛంద సంస్థ ముసుగులో సాగుతున్న ఆక్సిజన్ సిలిండర్ల దందాకు రాచకొండ ఎస్ఓటీ, మల్కాజిగిరి పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి వాహనం, ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం వివరాలు.. కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ మాస్ ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు. కరోనా బాధితులుకు ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సు సేవలు ఉచితంగా అందిస్తామంటూ ప్రచారం చేసుకున్నాడు. ఉచితం అంటూ బ్లాక్మార్కెట్లో అమ్మకం ఈ ముసుగులో సల్మాన్ అనే వ్యక్తి నుంచి 150 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్‌ను రూ.16 వేలకు ఖరీదు చేస్తున్నాడు. ఆపై నల్లబజారుకు తరలించి కరోనా పేషెంట్లకు రూ.25 వేలకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్న వాహనం మౌలాలీ మీదుగా ఈసీఐఎల్ వైపు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మల్కాజిగిరి పోలీసుల సహకారంతో రాత్రి 10 గంటలకు జెడ్టీఎస్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. వీరికి మాస్ ఫౌండేషన్ అంటూ రాసి ఉన్న ఓమ్నీ వాహనం కనిపించింది. అనుమానంతో తనిఖీ చేయగా అందులో 150 లీటర్ల 5 ఆక్సిజన్ సిలిండర్లు బయటపడ్డాయి. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు వాహనంలో లభించలేదు. ఓమిని వ్యాన్ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్లాతో పాటు వాహనంలోని మహ్మద్ మజార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఫలితంగా ఆసిఫ్ చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆక్సిజన్ సిలిండర్లు, వాహనాన్ని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యాంటీ వైరల్ డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర అత్యవసర మందుల అక్రమ దందాలపై కన్నేసి ఉంచుతున్నామని అధికారులు పేర్కొన్నారు. ( చదవండి: కరోనా వ్యాక్సిన్ బ్లాక్ దందాకు చెక్: ముఠా అరెస్ట్ ) -
పబ్జీ ఎఫెక్ట్.. గేర్ సైకిళ్లే టార్గెట్
సాక్షి, హైదరాబాద్ : వ్యవనాలకు బానిసై డబ్బుల కోసం గేర్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న యువ పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి, ఇన్స్పెక్టర్లు మన్మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మౌలాలి మంగాపురం కాలనీకి చెందిన నందుల సిద్దార్థ శర్మ అలియాస్ సిద్దూ అర్చకుడిగా పని చేసేవాడు. వ్యసనాలకు అలవాటు పడిన అతను పబ్జీ గేమ్‌కు బానిస అయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గేర్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్నాడు. వాటిని సైకిల్ దుకాణాలు, తెలిసిన వారికి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. వారికి అనుమానం రాకుండా పూజ చేసినందుకు బహుమతిగా ఇచ్చారని చెప్పేవాడు. మల్కాజిగిరి పీఎస్ పరిధిలో 4 కుషాయిగూడ పరిధిలో 7, నేరెడ్‌మెట్‌లో 4, నాచారం పరిధిలో ఒకటి చొప్పున దాదాపు 31 సైకిళ్లను చోరీ చేశాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు గురువారం మంగాపురంలో సిద్దూను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి నుంచి సుమారు రూ. 3,50,000 విలువ చేసే సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో 16 సైకిళ్ల యజమానుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. యజమానులు ఆధారాలు చూపి సరైన సైకిళ్లను తీసుకెళ్లవచ్చునన్నారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ లింగస్వామి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
పాత కరెన్సీ మార్పిడి ముఠా గుట్టురట్టు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో పాత కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి జోన్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఇందులో కీలకపాత్ర పోషించిన ఇద్దరితోపాటు ఒక జువైనల్‌ను అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పీఎస్‌లో మల్కాజిగిరి ఏసీపీ సందీప్ రావు బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన మహమ్మద్ హఫీజ్ హైదరాబాద్ వచ్చి ముర్గీచౌక్‌లో గాజులు తయారు చేస్తున్నాడు. తలాబ్ కట్టకు చెందిన ఆదిల్, ఘాజీ బజార్‌కు చెందిన బాబుభాయ్, మరొక మైనర్‌తో కలిసి లక్షకు ఇరవై శాతం కమీషన్‌తో పాత కరెన్సీ మార్పిడి చేస్తామని నమ్మబలికి సన్నిహితులు, మిత్రులు, బంధువుల నుంచి దాదాపు రూ.75 లక్షలకు పాత కరెన్సీని సేకరించారు. ప్రధాన నిందితుడు హఫీజ్ బుధవారం ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌లో తన దగ్గర ఉన్న రూ.74 లక్షల 71 వేలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి రెండు మోటర్ సైకిళ్లపై దాచిపెట్టి మధ్యవర్తుల కోసం ఆదిల్‌తో కలిసి ఎదురు చూస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.74.71 లక్షల విలువ జేసే పాత కరెన్సీ, రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడు బాబూభాయ్ పరారీలో ఉండగా మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకుని అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
ఎన్ఆర్ఐ అరెస్టు
మల్కాజిగిరి: భార్యను వేధిస్తున్న ఎన్ఆర్ఐ భర్తను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మౌలాలి గాయత్రీనగర్‌కు చెందిన వాణి, సాప్ట్వేర్ ఉద్యోగి వినోద్‌కుమార్(45) దంపతులు. విదేశాల్లో పనిచేసే వినోద్‌కుమార్ ఇటీవల హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొనడంతో వాణిని విడాకుల కోసం ఒత్తిడి చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు వినోద్‌కుమార్‌ను అరెస్టు చేశారు. -
మరదలి పట్ల అసభ్యకర ప్రవర్తన, ఒకరి అరెస్ట్
హైదరాబాద్: మరదలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో ఓ వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం... గౌతంనగర్‌కు చెందిన ఫ్రాన్సిస్ జేవియర్(38), దేవీ భార్యాభర్తలు. ఫ్రాన్సిస్‌కు దేవీ రెండో భార్య. ఈ నెల 8వ తేదీ దేవీ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరైన దేవీ చెల్లెలు ఆశ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయడంతో జేవియర్‌ను గురువారం రిమాండ్‌కు తరలించారు.