సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛంద సంస్థ ముసుగులో సాగుతున్న ఆక్సిజన్ సిలిండర్ల దందాకు రాచకొండ ఎస్‌ఓటీ, మల్కాజిగిరి పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి వాహనం, ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం వివరాలు.. కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ మాస్ ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు. కరోనా బాధితులుకు ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సు సేవలు ఉచితంగా అందిస్తామంటూ ప్రచారం చేసుకున్నాడు.
ఉచితం అంటూ బ్లాక్‌మార్కెట్‌లో అమ్మకం
ఈ ముసుగులో సల్మాన్ అనే వ్యక్తి నుంచి 150 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్‌ను రూ.16 వేలకు ఖరీదు చేస్తున్నాడు. ఆపై నల్లబజారుకు తరలించి కరోనా పేషెంట్లకు రూ.25 వేలకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్న వాహనం మౌలాలీ మీదుగా ఈసీఐఎల్ వైపు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మల్కాజిగిరి పోలీసుల సహకారంతో రాత్రి 10 గంటలకు జెడ్‌టీఎస్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. వీరికి మాస్ ఫౌండేషన్ అంటూ రాసి ఉన్న ఓమ్నీ వాహనం కనిపించింది.
అనుమానంతో తనిఖీ చేయగా అందులో 150 లీటర్ల 5 ఆక్సిజన్ సిలిండర్లు బయటపడ్డాయి. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు వాహనంలో లభించలేదు. ఓమిని వ్యాన్ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్లాతో పాటు వాహనంలోని మహ్మద్ మజార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఫలితంగా ఆసిఫ్ చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆక్సిజన్ సిలిండర్లు, వాహనాన్ని, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యాంటీ వైరల్ డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర అత్యవసర మందుల అక్రమ దందాలపై కన్నేసి ఉంచుతున్నామని అధికారులు పేర్కొన్నారు.
( చదవండి: కరోనా వ్యాక్సిన్ బ్లాక్ దందాకు చెక్: ముఠా అరెస్ట్ )
Comments
Please login to add a commentAdd a comment