నిందితుడు దొంగిలించిన సైకిళ్లు, ఇన్‌సెట్లో నిందితుడు సిద్దార్థ శర్మ
సాక్షి, హైదరాబాద్ : వ్యవనాలకు బానిసై డబ్బుల కోసం గేర్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న యువ పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు మన్మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మౌలాలి మంగాపురం కాలనీకి చెందిన నందుల సిద్దార్థ శర్మ అలియాస్ సిద్దూ అర్చకుడిగా పని చేసేవాడు. వ్యసనాలకు అలవాటు పడిన అతను పబ్‌జీ గేమ్‌కు బానిస అయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గేర్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్నాడు. వాటిని సైకిల్ దుకాణాలు, తెలిసిన వారికి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. వారికి అనుమానం రాకుండా పూజ చేసినందుకు బహుమతిగా ఇచ్చారని చెప్పేవాడు.
మల్కాజిగిరి పీఎస్ పరిధిలో 4 కుషాయిగూడ పరిధిలో 7, నేరెడ్‌మెట్‌లో 4, నాచారం పరిధిలో ఒకటి చొప్పున దాదాపు 31 సైకిళ్లను చోరీ చేశాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు గురువారం మంగాపురంలో సిద్దూను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి నుంచి సుమారు రూ. 3,50,000 విలువ చేసే సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో 16 సైకిళ్ల యజమానుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. యజమానులు ఆధారాలు చూపి సరైన సైకిళ్లను తీసుకెళ్లవచ్చునన్నారు. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐ లింగస్వామి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment