‘మహారాణి’ పరువు పోయింది !
ఇది బెంగళూరులోని మహరాణి మహిళా కళాశాల... ఈ కళాశాల వద్ద ఇంత మంది పోలీసులు ఉన్నారంటే పోకిరీల పనిపట్టడాని కోసం అనుకుంటే మీరు పొరబడినట్లే.. శనివారం ఉదయం ఈ కళాశాల విద్యార్థినులు రెండు జట్లుగా విడిపోయి జుట్లు పట్టుకుని ఆ కళాశాల పరువు తీశారు. ఈ సంఘటన నగర వాసులను నివ్వెరపరిచింది. ఓ లెక్చరర్ బదిలీ విషయమై ఈ రెండు వర్గాల విద్యార్థినులు వీధిలోకి వచ్చి కొట్టుకోవడంతో పోలీసులు వచ్చి విడిపించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కళాశాల వద్ద భద్రత నిర్వహిస్తున్న దృశ్యమే ఇది.
బెంగళూరు: మహరాణి కళాశాల విద్యార్థినులు కొట్లాటకు దిగారు. పరీక్షల సమయంలో చక్కగా చదువుకోవాల్సిన విద్యార్థినులు జుట్లుజుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. వివరాలు....మహారాణి కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ బదిలీ విషయం పై కొన్ని రోజులుగా మహారాణి కళాశాల విద్యార్థినులు పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రొఫెసర్ బదిలీని నిలిపేయాలని కొందరు విద్యార్థినులు డిమాండ్ చేస్తుండగా, ఆ ప్రొఫెసర్ బదిలీ సబబేనని మరికొంత మంది విద్యార్థినులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మహారాణి కళాశాల ప్రాంగణంలో ఉన్నట్టుండి ఆర్ట్స్, కామర్స్ విభాగాలకు చెందిన విద్యార్థినులు ఇదే విషయంపై చర్చకు దిగారు. ఈ చర్చ చిలికి చిలికి గాలి వానగా మారి ఇరు విభాగాల విద్యార్థినుల మధ్య గొడవకు దారి తీసింది.
పోలీసులు అడ్డుపడి వారిని విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఒకరినొకరు అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ, జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన పోలీసులు కళాశాలకు సెలవు ప్రకటించి విద్యార్థినులను ఇళ్లకు పంపించేశారు.