Mamata Prasad
-
12 బస్సుల సీజ్
సాక్షి, సంగారెడ్డి: ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్న ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లపై ఆర్టీఏ అధికారులు కొరడా జులుపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వోల్వో బస్సు దగ్ధమై 45 మంది ప్రయాణీకులు దుర్మరణం చెందిన నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు శుక్రవారం నిబంధనలు పాటించని 12 బస్సులను సీజ్ చేశారు. ఉదయం 04-08 గంటల మధ్య రవాణా శాఖ ప్రత్యేక బృందాలు విస్తృతంగా సోదాలు జరిపాయి. జహీరాబాద్ చెక్‌పోస్టు వద్ద ఐదు, కంది వద్ద ఐదు బస్సులు, చిరాగ్పల్లి బైపాస్ ఒక బస్సు, పటాన్చెరు రహదారిపై ఒక వోల్వో బస్సును సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిలో కేసినేని, నేట, నకోడా, సహార, సూపర్ ట్రావెల్స్ చెందిన ఒక్కో వాహనం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయటపడడానికి ఎమర్జెన్సీ ద్వారం లేకపోవడం, పర్మిట్ లేని ప్రాంతంలో తిప్పుతుండడం, ప్రథమ చికిత్స పెట్టే లేకపోవడం, ప్రత్యామ్నాయం డ్రైవర్ లేకపోవడం, డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం తదితర ఉల్లంఘనలు బయటపడడంతోనే ఈ బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ మమతా ప్రసాద్ తెలిపారు. సీజ్ చేసిన బస్సుల యజమానులపై కేసులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. గురువారం జరిపిన సోదాల్లో పరిమితికి మించిన ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న అక్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సును అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. -
ప్రైవేటు బస్సులపై కొరడా
సాక్షి, సంగారెడ్డి: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమై 45 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో రవాణా శాఖ మేల్కొంది. గురువారం ఉదయం 04 - 08 గంటల మధ్య రవాణా శాఖ అధికారులు జిల్లాలో ప్రైవేటు బస్సులపై అకస్మిక దాడులు జరిపారు. జహీరాబాద్, చిరాగ్పల్లి, కంది చెక్‌పోస్టుల వద్ద బస్సులను నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రవాణా పర్మిట్లు, ఇన్స్యూరెన్స్, ప్రయాణికుల సంఖ్య, డ్రైవర్ లెసైన్స్ తదితర అంశాలను పరిశీలించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మమతా ప్రసాద్ నేతృత్వంలో 15 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ దాడుల్లో పాల్గొన్నారు. సుమారు 70 బస్సులను తనిఖీ చేశారు. అధికారుల కన్నుగప్పి తనిఖీలను తప్పించుకోవడానికి జహీరాబాద్ చెక్‌పోస్టు మీద నుంచి కాక చిరాగ్పల్లి మీదుగా ఎక్కువగా ప్రైవేటు బస్సులు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిపిన సోదాల్లో పరిమితికి మించిన ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న అక్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సును అధికారులు సీజ్ చేశారు. ప్రయాణీకులను పటాన్చెరువద్ద దింపేసి ఆ బస్సును సంగారెడ్డి మండలం కందిలోని డీటీసీ కార్యాలయానికి తరలించారు. బస్సు సీటింగ్ సామర్థ్యం డ్రైవర్‌తో సహా 37 ఉండగా మరో 5 మంది ప్రయాణీకులను అధికంగా కలిగి ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రయాణికుల వివరాలను సైతం రిజిస్టర్లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో బస్సు యజమానిపై క్రిమినల్ కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. డ్రైవర్ యూనిఫాం వేసుకోకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం లాంటి స్వల్ప ఉల్లంఘనలతో పట్టుబడిన మరో రెండు బస్సులపై జరిమానాలు విధించి వదిలేశారు. ఇకపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని డీటీసీ మమతా ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు.