సాక్షి, సంగారెడ్డి: ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్న ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లపై ఆర్టీఏ అధికారులు కొరడా జులుపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వోల్వో బస్సు దగ్ధమై 45 మంది ప్రయాణీకులు దుర్మరణం చెందిన నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు శుక్రవారం నిబంధనలు పాటించని 12 బస్సులను సీజ్ చేశారు. ఉదయం 04-08 గంటల మధ్య రవాణా శాఖ ప్రత్యేక బృందాలు విస్తృతంగా సోదాలు జరిపాయి. జహీరాబాద్ చెక్‌పోస్టు వద్ద ఐదు, కంది వద్ద ఐదు బస్సులు, చిరాగ్‌పల్లి బైపాస్ ఒక బస్సు, పటాన్‌చెరు రహదారిపై ఒక వోల్వో బస్సును సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిలో కేసినేని, నేట, నకోడా, సహార, సూపర్ ట్రావెల్స్ చెందిన ఒక్కో వాహనం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయటపడడానికి ఎమర్జెన్సీ ద్వారం లేకపోవడం, పర్మిట్ లేని ప్రాంతంలో తిప్పుతుండడం, ప్రథమ చికిత్స పెట్టే లేకపోవడం, ప్రత్యామ్నాయం డ్రైవర్ లేకపోవడం, డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం తదితర ఉల్లంఘనలు బయటపడడంతోనే ఈ బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ మమతా ప్రసాద్ తెలిపారు.
సీజ్ చేసిన బస్సుల యజమానులపై కేసులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. గురువారం జరిపిన సోదాల్లో పరిమితికి మించిన ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న అక్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సును అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.