ఈ చిన్నారిని కాపాడరూ!
మామిడిగుడ్డి(మెళియాపుట్టి) :తోటి చిన్నారులతో ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ చదువుకుంటున్న ఆ చిన్నారిపై విధి చిన్నచూపు చూసింది. క్యాన్సర్ వ్యాధి సోకడంతో మంచంపట్టి కనీసం కదలలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. తమ బిడ్డను ఏ దేవుడైనా కరుణించకపోతాడా అని ఆ తల్లిదండ్రులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వివరాలివీ.. మామిడిగుడ్డి గ్రామానికి చెందిన మూడో తరగతి చదువుతున్న జన్ని నందిని(8) ఈ ఏడాది సెప్టెంబర్ లో అనారోగ్యానికి గురైంది. అంతకుముందు ఎడమ కంటికి చిన్న గాయం కాగా, ఆ తర్వాత నుంచి కన్ను బయటకు ఉబ్బెత్తుగా వస్తూ అనారోగ్యం పాలైంది. తలిదండ్రులు లక్ష్మి, వెంకటస్వామి ఆ చిన్నారిని శ్రీకాకుళం, విశాఖలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఐటీడీఏ సాయంతో విశాఖపట్నం కేజీహెచ్‌లో చేర్పించారు. కొద్దిరోజులు బాలికకు వైద్య పరీక్షలు చేయించిన వైద్యులు చివరికి క్యాన్సర్ వ్యాధి సోకినట్లు ధ్రువీకరించారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. అంత ఆర్థిక స్థోమతలేని ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేశారు. కుమార్తెకు వైద్యం చేయించుకోలేని దుస్థితిని తలుచుకుని రోజూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం నందిని ఆరోగ్యం రోజురోజూకూ క్షీణిస్తోంది. ఆహారంగా కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటోంది. తమ కుమార్తెకు హైదారాబాద్‌లో మెరుగైన వైద్యసేవలు అందిస్తే తప్ప బతికే అవకాశం లేదని కంటి తడిపెడుతున్నారు. దాతలు, ఐటీడీఏ సహకరించి తన కుమార్తెకు మెరుగైన వైద్యం అందించాలని వారు వేడుకుంటున్నారు. కాగా, చిన్నారి నందినికి మెరుగైన వైద్యం అందించేలా ఆర్వీఎం చర్యలు చేపట్టాలని సోమవారం జరిగిన ఎస్ఎంసీ సమావేశంలో తీర్మానించినట్లు జీపీఎస్ పాఠశాల హెచ్ఎం ఎస్.రామారావు తెలిపారు.