Mana Kurralle
-
సరికొత్త పాత్రలో రాజమౌళి
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి నటుడిగా అవతారం ఎత్తుతున్నారా ? అది అతిథి పాత్రలో అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలు. ప్రముఖ దర్శకుడు వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మన కుర్రాళ్లే'. ఆ చిత్రంలో రాజమౌళి అతిథి పాత్రలో నటించనున్నారని సమాచారం. ఆ చిత్రంలో రాజమౌళి నటిస్తున్న పాత్ర ఆ చిత్రానికి అత్యంత కీలకమైందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. మన కుర్రోళ్లు చిత్రం అరవింద్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే తన దర్శకత్వంలో మహా బిజీగా ఉన్న రాజమళి... అతిథి పాత్రలో నటించడం ద్వారా మరింత బిజీ అయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ప్రతి ప్రయత్నం కొత్తగానే...
‘‘సగటు ప్రేక్షకునికి చేరువయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించాను. సందేశంతో కూడిన సమస్యాత్మక కథాంశమిది’’ అని దర్శకుడు వీరశంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో అరవింద్ కృష్ణ, రాజ్కల్యాణ్, రచన మల్హోత్రా, శ్రుతీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మన కుర్రాళ్లే’. బీవీఎస్ శ్రీనివాస్, హరూన్ హెచ్.ఎస్ ఈ చిత్రానికి నిర్మాతలు. రాజ్, గురుకిరణ్, జి.కె, మనోమూర్తి, శివ కాకాని, మోహన్ జోహ్న, బీమ్స్, పవన్‌కుమార్, సాయిరామ్ మద్దూరి కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్ సీడీని దర్శకుడు మారుతి, పాటల సీడీని నటుడు కృష్ణుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ,‘‘సమాజంలో ఎదురవుతున్న సంఘటనలు, ప్రజలు అనుభవిస్తున్న కష్టాల నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా ఇది. ఎందుకంటే... కథకు తగ్గట్టు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని తెలిపారు. నేటి సమాజంలో ఇలాంటి సినిమా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, వీరశంకర్ చేసే ప్రతి ప్రయత్నం కొత్తగానే ఉంటుందనీ అతిథిగా విచ్చేసిన దర్శకుడు శివనాగేశ్వరరావు చెప్పారు. యువతకు వినోదంతో పాటు సందేశాన్ని కూడా అందించే సినిమా ఇదని మారుతి అన్నారు. యూనిట్ సభ్యులతో పాటు దర్శకులు రామ్‌ప్రసాద్, దేవీప్రసాద్, వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, విమర్శకులు మహేశ్ కత్తి, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమాజానికి పనికొచ్చే సినిమా ఇది
‘‘మన చుట్టూ ఉన్న సమాజం, అక్కడ జరుగుతున్న సంఘటనలు, ప్రజల కష్టాల నేపథ్యంలో సినిమా తీయాలన్న నా కల ఇప్పటికి నెరవేరింది. సమాజానికి పనికొచ్చే సినిమా ఇది. ప్రేక్షకులు ప్రభావితమయ్యే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి’’ అని దర్శకుడు వీరశంకర్ చెప్పారు. అరవింద్ కృష్ణ, రాజ్కల్యాణ్, కృష్ణుడు, వెంకట్, రచనా మల్హోత్ర ముఖ్యతారలుగా బీవీఎస్ శ్రీనివాస్, హరూన్.హెచ్ఎస్ నిర్మించిన చిత్రం ‘మన కుర్రాళ్లే’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. వెబ్‌సైట్‌ను ఎస్.పి.రామ్మోహన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను దర్శకుడు శివనాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ -‘‘వీరశంకర్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా సూపర్‌హిట్ కావాలి’’ అని ఆకాంక్షించారు. సొంత ఊరి కోసం కొంతమంది కుర్రాళ్లు ఏం చేశారన్నదే ఈ సినిమా అని శివనాగేశ్వరరావు చెప్పారు. టైటిల్ చాలా బావుందని దేవీప్రసాద్ పేర్కొన్నారు. ముజీర్ కెమెరా పనితనం, వికర్ణ సంభాషణలు ప్లస్ అవుతాయని అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి, రామ్‌ప్రసాద్, త్రిపురనేని చిట్టి, రాంబాబు తదితరులు మాట్లాడారు.