ప్రతి ప్రయత్నం కొత్తగానే...
‘‘సగటు ప్రేక్షకునికి చేరువయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించాను. సందేశంతో కూడిన సమస్యాత్మక కథాంశమిది’’ అని దర్శకుడు వీరశంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో అరవింద్ కృష్ణ, రాజ్‌కల్యాణ్, రచన మల్హోత్రా, శ్రుతీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మన కుర్రాళ్లే’. బీవీఎస్ శ్రీనివాస్, హరూన్ హెచ్.ఎస్ ఈ చిత్రానికి నిర్మాతలు. రాజ్, గురుకిరణ్, జి.కె, మనోమూర్తి, శివ కాకాని, మోహన్ జోహ్న, బీమ్స్, పవన్‌కుమార్, సాయిరామ్ మద్దూరి కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
బిగ్ సీడీని దర్శకుడు మారుతి, పాటల సీడీని నటుడు కృష్ణుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ,‘‘సమాజంలో ఎదురవుతున్న సంఘటనలు, ప్రజలు అనుభవిస్తున్న కష్టాల నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా ఇది. ఎందుకంటే... కథకు తగ్గట్టు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని తెలిపారు.
నేటి సమాజంలో ఇలాంటి సినిమా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, వీరశంకర్ చేసే ప్రతి ప్రయత్నం కొత్తగానే ఉంటుందనీ అతిథిగా విచ్చేసిన దర్శకుడు శివనాగేశ్వరరావు చెప్పారు. యువతకు వినోదంతో పాటు సందేశాన్ని కూడా అందించే సినిమా ఇదని మారుతి అన్నారు. యూనిట్ సభ్యులతో పాటు దర్శకులు రామ్‌ప్రసాద్, దేవీప్రసాద్, వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, విమర్శకులు మహేశ్ కత్తి, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.