ఇష్టారాజ్యంగా మేనేజ్మెంట్ సీట్ల భర్తీ
రాజమండ్రి రూరల్ : జిల్లాలోని డీఎడ్ కళాశాలలు ఇష్టానుసారంగా మేనేజ్మెంట ్సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి. డీసెట్ కన్వీనర్ షరతులను సైతం యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కన్వీనర్ కోటాలో ప్రభుత్వం భర్తీ చేసిన సీట్లకు అభ్యర్థుల నుంచి బిల్డింగ్ఫీజు పేరుతో వేలాది రూపాయలు గుంజుతున్నారు. జిల్లాలో 40 డీఎడ్ కళాశాలలు ఉండగా వాటిలో ఐదు కళాశాలకు 100 సీట్లు, 35 కళాశాలకు 50 సీట్లు చొప్పున ఉన్నాయి.
ఇందులో 80 శాతం కన్వీనర్ కోటాలో ప్రభుత్వం డీఎడ్ మొదటి ఏడాదికి భర్తీ చేయగా, మిగిలిన 20 శాతం మేనేజ్మెంట్ ఆధీనంలో ఉంటాయి. వీటిని ఆయా కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భర్తీ చేయాల్సి ఉంది. జిల్లాలో చాలామంది కళాశాలల యాజమాన్యాలు డీసెట్ కన్వీనర్ నిబంధనలను పట్టించుకోవడంతో పాటు కళాశాలలకు తరగతులకు హాజరు కాకుండా పరీక్షలు రాసేందుకు వచ్చేలా అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నారు.
ఇలా కన్వీనర్ కోటాలో భర్తీ అయిన అభ్యర్థులు కూడా అధికసంఖ్యలో పరీక్షలు రాసేందుకు వచ్చేలా అదనంగా సొమ్ములు చెల్లించిన ట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వాధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని పలువురు విద్యా పండితులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. గత ఏడాది ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చేసిన తప్పిదాలకు రాష్ట్రంలో 950 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలకు దూరమైన విషయం తెలిసిందే. వారికి ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
డీసెట్ కన్వీనర్ తాజా ఆదేశాలు ఇవే ..
ఓసీ, బీసీ విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందేందుకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో 50 శాతం పైగా మార్కులు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. డీసెట్ ఎంట్రన్స్ టెస్టులో 40 శాతం పైగా మార్కులు వచ్చిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఇంటర్మీడియెట్‌లో 45 శాతంపైగా మార్కులు, డీసెట్ ఎంట్రన్స్‌లో 35 శాతం మించి మార్కులు పొంది ఉండాలి. ఈ అర్హతలు ఉన్న విద్యార్థులకు యాజమాన్యాలు తమ కళాశాల మేనేజ్మెంట్ కోటాలను భర్తీ
చేసుకోవాలని డీసెట్ కన్వీనర్ సూచించారు.