ఆర్.కృష్ణయ్యకు మండల్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీ బీసీలకు వ్యతిరేకమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సమన్వయ సమితి, సోషలిస్టు ఎంప్లాయీస్ అసోసియేషన్, తెలంగాణ అధికారులు, ఉద్యోగుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ ప్రదాత బీపీ మండల్ 95వ జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తా త్రేయ, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సభాధ్యక్షుడు జి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆర్.కృష్ణయ్యకు మండల్ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేసి, సన్మానించారు.
అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. బీసీలను భిక్షగాళ్లుగా చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో బీసీలు 70 కోట్ల మంది ఉన్నారని, వారికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు లేదని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు స్ఫూర్తి ప్రదాత బీపీ మండల్‌యేనని ఆర్.కృష్ణయ్య కొనియాడారు. బీసీల కోసం 30 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న ఆర్.కృష్ణయ్యకు మండల్ అవార్డు ఇవ్వడం హర్షదాయకమని దత్తాత్రేయ పేర్కొన్నారు. సభలో సీనియర్ పాత్రికేయుడు దుర్గం రవీందర్ రచించిన ‘ఓబీసీ రిజర్వేషన్ల ఆద్యుడు బీపీ మండల్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సేవ జాతీయ కార్యదర్శి రాజీవ్‌రాజు (యూపీ), బీసీ నాయకుడు గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, పెరిక సురేష్, అజయ్‌కుమార్, నీలం వెంకటేష్, రాంకోటి, దేవేందర్, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.