Mandal Education Officers
-
‘నారాయణ’ నాటకాలు.. స్కూల్ భవనం లేదు, అనుమతులు లేవు! కానీ ఫీజులు మాత్రం..
సాక్షి,పుత్తూరు రూరల్(తిరుపతి): ‘‘ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం’’అన్న సామెత పుత్తూరు పట్టణంలో నారాయణ విద్యా సంస్థ నాటకాలకు తెరదీసింది. సదరు సంస్థ గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులను ప్రలోభ పెడుతూ అడ్మిషన్ల పేరిట వేల రూపాయలను వసూలు చేస్తోంది. నారాయణ స్కూల్ పేరుతో బస్సు ఒకటి పట్టణంలో తిరుగుతూ, అందులోంచి కొంత మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభించామని, కరపత్రాలను పంచుతూ తల్లిదండ్రులను ప్రలోభ పెడుతున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు రూ.3,500 అని, 6వ తరగతికి రూ.28 వేలు, 8వ తరగతికి రూ.30 వేలుగా చెబుతూ వాట్సాప్, ఫోన్ల ద్వారా ఊదరగొట్టేస్తున్నారు. కనీసం భవనం లేకుండా అడ్మిషన్లు ఏంటని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులకు నిర్మాణం జరుగుతోందని, త్వరలోనే చూపిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కొందరు అడ్మిషన్ ఫీజులు చెల్లించి సీటును రిజర్వు చేసుకుంటున్నారు. వాస్తవానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి పుత్తూరు పట్టణంలో ఎక్కడా భవనం లేదు. విద్యాశాఖ అధికారులు సైతం నారాయణ విద్యా సంస్థకు పుత్తూరులో ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తొందర పడి వేలాది రూపాయలను చెల్లించి మోసపోకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ‘నారాయణ’కు అనుమతులు లేవు నారాయణ విద్యా సంస్థకు పుత్తూరు పట్టణంలో ఎలాంటి అనుమతులు లేవు. దరఖాస్తు చేసుకోలేదు. అయినా పుత్తూ రు ప్రచారం నిర్వహిస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. విషయాన్ని డీఈఓ దృష్టికి తసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. – ఎంఈఓ తిరుమలరాజు -
ఇక రోజూ తనిఖీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సర్కారు బడులను పటిష్టం చేసేందుకు జిల్లా విద్యాశాఖ కొత్త ప్రణాళిక రూపొందిం చింది. ఇకపై ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు ప్రతిరోజు పాఠశాలలను తని ఖీచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తనిఖీ సమయంలో పరిశీలించాల్సిన అంశాలు, సేకరించాల్సిన వివరాలపై ఒక నమూనా రూపొందించి శుక్రవారం సరూర్నగర్ మండల వనరుల కేంద్రంలో జరిగిన సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి సంబంధిత అధికారులకు అందించారు. ఈ క్రమంలో నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా సమీక్షలు.. క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేసే అంశాలపై ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్ష చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. మండల స్థాయిలో తనిఖీలు చేసిన నేపథ్యంలో వచ్చిన నివేదికల ఆధారంగా జిల్లా స్థాయిలో ఒక నివేదికను తయారు చేస్తారు. ఈ నివేదికపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇలా క్రమం తప్పకుండా పదిహేనురోజులకోసారి డీఈఓతోపాటు కలెక్టర్ కూడా ప్రత్యేకంగా సమీక్షించడంతో సత్ఫలితాలు వస్తాయని విద్యాశాఖ భావిస్తోంది. తక్షణ కర్తవ్యం.. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ముందుగా గుర్తింపులేని పాఠశాలలు, ఫీజులపై విద్యాశాఖ దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్కూళ్ల వారీగా తీసుకునే ఫీజులకు సంబంధించి ప్రత్యేక నివేదికను రెండ్రోజుల్లో ఇవ్వాలని డీఈఓ మండల విద్యాధికారులను ఆదేశించారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు గుర్తింపులేని పాఠశాలలకు ఇప్పటికే నోటీసులిచ్చినప్పటికీ.. తాజా పరిస్థితిని బట్టి చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును లక్ష్యంగా తీసుకున్న విద్యాశాఖ.. ఆమేరకు ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఉపాధ్యాయుడు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని, నాణ్యమైన విద్య నందించాలంటూ సమావేశంలో హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు.