
ఇక రోజూ తనిఖీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సర్కారు బడులను పటిష్టం చేసేందుకు జిల్లా విద్యాశాఖ కొత్త ప్రణాళిక రూపొందిం చింది. ఇకపై ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు ప్రతిరోజు పాఠశాలలను తని ఖీచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తనిఖీ సమయంలో పరిశీలించాల్సిన అంశాలు, సేకరించాల్సిన వివరాలపై ఒక నమూనా రూపొందించి శుక్రవారం సరూర్‌నగర్ మండల వనరుల కేంద్రంలో జరిగిన సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి సంబంధిత అధికారులకు అందించారు. ఈ క్రమంలో నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
క్రమం తప్పకుండా సమీక్షలు..
క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేసే అంశాలపై ప్రతి పదిహేను రోజులకోసారి సమీక్ష చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. మండల స్థాయిలో తనిఖీలు చేసిన నేపథ్యంలో వచ్చిన నివేదికల ఆధారంగా జిల్లా స్థాయిలో ఒక నివేదికను తయారు చేస్తారు. ఈ నివేదికపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇలా క్రమం తప్పకుండా పదిహేనురోజులకోసారి డీఈఓతోపాటు కలెక్టర్ కూడా ప్రత్యేకంగా సమీక్షించడంతో సత్ఫలితాలు వస్తాయని విద్యాశాఖ భావిస్తోంది.
తక్షణ కర్తవ్యం..
విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ముందుగా గుర్తింపులేని పాఠశాలలు, ఫీజులపై విద్యాశాఖ దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్కూళ్ల వారీగా తీసుకునే ఫీజులకు సంబంధించి ప్రత్యేక నివేదికను రెండ్రోజుల్లో ఇవ్వాలని డీఈఓ మండల విద్యాధికారులను ఆదేశించారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు గుర్తింపులేని పాఠశాలలకు ఇప్పటికే నోటీసులిచ్చినప్పటికీ.. తాజా పరిస్థితిని బట్టి చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును లక్ష్యంగా తీసుకున్న విద్యాశాఖ.. ఆమేరకు ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఉపాధ్యాయుడు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని, నాణ్యమైన విద్య నందించాలంటూ సమావేశంలో హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశారు.