మండలి రాజీనామా ఆమోదించిన గవర్నర్
అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన గవర్నర్ ఈఎస్ఎల్ నరిసింహన్కు పంపారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమెదించారు.అనంతరం అధికార భాషా సంఘాన్ని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మండలి బుద్ధ ప్రసాద్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
2004లో కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆయన పశుసంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పని చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరికి నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. దాంతో నామినేటడ్ పోస్ట్‌లో ఉన్న వారు తమతమ పదవులకు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.