UP Assembly Election 2022: ‘మాణిక్పూర్’కా మాలిక్ కౌన్!
అక్కడ దశాబ్దాలుగా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో రక్తపాతం పారిస్తున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే గ్రామాల ప్రజలను నిత్యం వేధిస్తూ వారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని చంబల్ మాదిరే డెకాయిట్ల అకృత్యాలతో అల్లాడుతున్న నియోజకవర్గం ఉత్తర్‌ప్రదేశ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని చిత్రకూట్ జిల్లాలోని ‘మాణిక్పూర్’. మినీ చంబల్‌గా పిలువబడే ఈ ప్రాంతంలోని డెకాయిట్లను ఏ ప్రభుత్వాలు అణచివేస్తాయో ఆ పార్టీకి ఇక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. డెకాయిట్లతో దోస్తీ ఉందన్న కారణంతో సమాజ్‌వాదీ పార్టీని దూరం పెడుతున్నారు. ఇక్కడ ఇంతవరకూ గెలువని ఏనాడు గెలవని ఎస్పీ ప్రస్తుత ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
మినీ చంబల్‌లో ఐదు దశాబ్దాలుగా అరాచకాలు
ప్రస్తుత యూపీ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశం అయిన అసెంబ్లీ ఏదైనా ఉందంటే అది మాణిక్పూర్ నియోజకవర్గమే. వింధ్యా పర్వత శ్రేణుల మధ్యలో మధ్యప్రదేశ్–ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దులతో ఉన్న మాణిక్‌పూర్‌లో ఐదు దశాబ్దాలుగా దోపిడీ దొంగల హవా నడుస్తోంది. దోపిడీ దొంగల కారణంగా ఈ ప్రాంతం మినీ చంబల్‌గా అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1965 ప్రాంతంలో ఇక్కడ గజదొంగగా పేరుగడించిన తయా ప్రసాద్ 15 ఏళ్ల పాటు నానా బీభత్సం సృష్టించాడు. గయా ప్రసాద్ పేరు చెబితేనే చిత్రకూట్ మొత్తం వణికిపోయేదని, ఇక్కడ సాయంత్రం కాగానే అతని భయంతో ఇళ్లకు తాళాలు వేసి ఉంచేవారని చెబుతారు. గయా ప్రసాద్ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండేవాడు. అతని తర్వాత ఎక్కువ కాలం పాటు ఆ ప్రాంతంలో పేరు గడించిన దోపిడీ దొంగ దదువా.
గయా ప్రసాద్ మరణం తర్వాత ఆయన వారసుడిగా 1980లో దదువా తెరపైకి వచ్చాడు. దదువా ప్రాంతీయ రాజకీయాల్లో తరుచూ జోక్యం చేసుకునేవాడు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ తరఫున ప్రచారం సైతం చేశాడు. దోపిడీ దొంగలకు ఎస్పీ ప్రభుత్వం వంత పాడుతోందన్న సందేశం ప్రజల్లోకి వెళ్లిన కారణంతో 2007 ,2012, 2017, 2019 (ఉప ఎన్నిక) ఎన్నికల్లో ఎస్పీని ఇక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. 2007లో మాయావతి ప్రభుత్వ హయాంలో ఇతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఇతని తర్వాత స్ఫెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై మెరుపుదాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనతో థొకియా అనే మరో దోపిడీదొంగ వెలుగులోకి వచ్చాడు. ఈ ఘటనలో ఆరుగురు కమాండోలు వీరమరణం పొందారు.
చదవండి: (UP Assembly Election 2022: నువ్కొకటి కొడితే... నేను రెండేస్తా!)
2008 ఆగస్టులో సిల్ఖోరి గ్రామంలో ఎస్టీఎఫ్ జరిపిన ఎన్కౌంటర్లో ఇతను హతమయ్యాడు. ఆ తర్వాత ఆ స్థానం గౌరీయాదవ్ తీసుకున్నాడు. యూపీ, ఎంపీల్లోని పలు పోలీస్స్టేషన్లలో గౌరీ యాదవ్‌పై హత్య, కిడ్నాప్ వంటి 60కి పైగా కేసులు నమోదయ్యాయి. గౌరీ యాదవ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో బహిల్పూర్వా అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో ఎస్టీఎఫ్ హతమార్చింది. వీరితో పాటే బల్ఖాడియా, బాబ్లీకోల్ వంటి గజదొంగలు ఈ ప్రాంతంలో బీభత్సం సృష్టించి ప్రజలను తీవ్రంగా హింసించారు.
డెకాయిట్లను అణిచిన పార్టీలకే ప్రజల మద్దతు...
నేర ప్రపంచంలో మకుటం లేని మారాజులుగా వెలిగిన క్రూరమైన నేరగాళ్లను అణిచివేసిన పార్టీలకు ఇక్కడి ప్రజలు తొలినుంచి మద్దతిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దదువా అరాచకాలు సాగిన కాలంలో జన్‌సంఘ్, కాంగ్రెస్ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దొంగల బీభత్సం నుంచి విముక్తి చేయడంలో కాంగ్రెస్, జన్సంఘ్లు ప్రత్యేక కృషి చేయలేకపోయాయని భావించిన ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారు. 1989, 1993లో మాణిక్పూర్ స్థానం నుంచి బీజేపీకి చెందిన మన్నూలాల్ ఎమ్మెల్యే అయ్యారు. మన్నూలాల్ గెలుపును జీర్ణించుకోలేని దదువా 1992లో మదయన్ గ్రామంలో ముగ్గురిని చంపి తర్వాత గ్రామం మొత్తానికి నిప్పంటించాడు. చాలా రక్తపాతం జరిగింది. దీంతో బెంబేలెత్తిన ప్రజలు 1996 ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన దద్దూ ప్రసాద్‌ను తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అతని పాలనలో బెదిరింపులు తగ్గడంతో 2002, 2007లో అతన్నే గెలిపించారు.
ఇక్కడ ప్రజల విశ్వాసాన్ని గమనించిన అప్పటి ముఖ్యమంత్రి మాయావతి దదువాను ఎన్కౌంటర్ చేయించింది. దీంతో 2012లో దద్దూ ప్రసాద్ తర్వాత బీఎస్పీ అభ్యర్థి చంద్రభాన్ సింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాణిక్‌పూర్‌లో బీఎస్పీ ఆధిక్యతను చూసి బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ వేసింది. పార్టీ బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే పటేల్‌ను అభ్యర్థిగా చేసి ఆయనను ఈ స్థానం నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించింది. బీజేపీ ప్లాన్ ఫలించి పటేల్ భారీ ఆధిక్యంతో గెలిచారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పటేల్ విజయం సాధించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా, బీజేపీ అభ్యర్థి ఆనంద్శుక్లా గెలిచారు. 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇక్కడి ప్రాంతంలో చాలామంది డెకాయిట్లను యోగి ప్రభుత్వం అంతమొందించడంతో బీజేపీ సానుకూలత కనబడుతోంది. ఇక నియోజకవర్గంలో ఇంతవరకూ గెలుపు రుచి చూడని ఎస్పీ ఎలాగైనా గెలవాలన్న గట్టి పట్టుదలతో ఉంది.
– సాక్షి, న్యూఢిల్లీ
గౌరీయాదవ్, బాబీకోల్