Manikumar
-
ట్రాన్స్‌ఫార్మర్‌పైనే మృత్యువాత
నర్సంపేట రూరల్: ఫ్యూజ్ వేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన విద్యుత్‌శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని వల్లభ్‌నగర్‌కు చెందిన మణికుమార్(22) విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి. ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ పనిచేయకపోవడంతో ఓ రైతు లైన్ ఇన్స్పెక్టర్కు సమాచారమిచ్చాడు. ఆయన సూచన మేరకు మణికుమార్ 11 కేవీ పాకాల ఫీడర్‌కు ఎల్సీ (విద్యుత్ సరఫరా నిలిపివేత) తీసుకొని ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు. అప్పటికే రాజుపేట ఫీడర్ ఛానల్ ఎల్టీ లైన్ సర్వాపురం శ్మశాన వాటిక వద్ద పాకాల ఫీడర్ విద్యుత్ వైర్లకు తాకడంతో విద్యుత్ ప్రసారం అవుతోంది. ఈ క్రమంలో ఫ్యూజ్ సరిచేస్తుండగా అతడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. -
'నా కుమారుడు ముమ్మాటికీ వడ్డెర కులస్తుడే'
విజయవాడ: తన కుమారుడు వేముల రోహిత్ మరణంపై అతడి తండ్రి మణికుమార్ నోరు విప్పారు. తన కుమారుడిది ఆత్మహత్యా కాదని, హత్య అని ఆరోపించారు. తన కొడుకు మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు ముమ్మాటికీ వడ్డెర కులస్తుడేనని ఆయన స్పష్టం చేశారు. తాము ఎస్సీ కులానికి చెందినవారిమని తన భార్య ఎందుకు చెబుతుందో అర్థం కావడం లేదన్నారు. రోహిత్ మరణంపై రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యతో విడాకులు తీసుకున్నా ఆమెతో కలిసే ఉంటున్నట్టు వెల్లడించారు. ఇటీవలే తన చిన్న కుమారుడి నిశ్చితార్థం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేస్తున్న రోహిత్ ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
విహార యాత్రలో విషాదం.. విద్యార్థి మృతి
వెంకటాపురం (వరంగల్): విద్యార్థుల విహార యాత్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామప్ప చెరువులో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం టవర్ గ్రామానికి చెందిన పాలకొండ మణికుమార్‌గా మృతి చెందిన విద్యార్థిని గుర్తించారు. శరత్ వికాస్ హైస్కూల్‌కు చెందిన 49 మంది విహారయాత్రలో భాగంగా మంగళవారం యాదగిరిగుట్ట చూసుకుని రామప్పలో రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం స్నానం కోసం విద్యార్థులు చెరువులో దిగినప్పుడు మణికుమార్‌కు ఈత రాకపోవడంతో మృతి చెందినట్టు తెలుస్తోంది.