
'నా కుమారుడు ముమ్మాటికీ వడ్డెర కులస్తుడే'
విజయవాడ: తన కుమారుడు వేముల రోహిత్ మరణంపై అతడి తండ్రి మణికుమార్ నోరు విప్పారు. తన కుమారుడిది ఆత్మహత్యా కాదని, హత్య అని ఆరోపించారు. తన కొడుకు మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు ముమ్మాటికీ వడ్డెర కులస్తుడేనని ఆయన స్పష్టం చేశారు. తాము ఎస్సీ కులానికి చెందినవారిమని తన భార్య ఎందుకు చెబుతుందో అర్థం కావడం లేదన్నారు.
రోహిత్ మరణంపై రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యతో విడాకులు తీసుకున్నా ఆమెతో కలిసే ఉంటున్నట్టు వెల్లడించారు. ఇటీవలే తన చిన్న కుమారుడి నిశ్చితార్థం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ చేస్తున్న రోహిత్ ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.