రేపట్నుంచే విశాఖలో విమానాలు!
తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాలు శుక్రవారం నుంచి తిరుగుతాయి. హుదూద్ విలయం సృష్టించిన ఐదు రోజులకు మళ్లీ గాలిమోటార్లు పనిచేయడం ప్రారంభం అవుతోంది. ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి, ఇక్కడినుంచి మళ్లీ హైదరాబాద్ వెళ్తుంది. 2009 ఫిబ్రవరిలో నిర్మించిన ఈ భవనం పైకప్పు బాగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు రన్‌వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని అధికారులు చెప్పారు.
గంటకు 180-195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విశాఖపట్నంతో పాటు విమానాశ్రయాన్ని తీవ్రంగా వణికించాయి. శనివారం నుంచి మరిన్ని విమానాలు తిరుగుతాయి. తాత్కాలికంగా ప్యాసింజర్ టెర్మినల్ మీద ఓ టార్పాలిన్ షీటును పైకప్పుగా వేశారు. ప్రస్తుతానికి కంప్యూటర్లన్నీ తుఫాను కారణంగా పాడైపోయాయి కాబట్టి, బోర్డింగ్ పాసులు మాత్రం మాన్యువల్‌గానే ఇస్తారు. నెలాఖరుకు విమానాశ్రయం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అధికారులు చెప్పారు.