వైఎస్ పాలనలోనే బడుగుల అభ్యున్నతి
జగనన్న నాయకత్వం కోసం ప్రజల ఎదురుచూపు
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడు డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గుర్తు చేశారు. తిరుపతి పరిధిలోని గాంధీపురం, దాసరిమఠం, ఎస్బీఐ కాలనీ ప్రాంతాల్లో బుధవారం వైఎస్ఆర్ సీపీ నాయకుడు మణ్యం చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు.
ప్రజాబాటలో కరుణాకరరెడ్డికి ఆ ప్రాంత ప్రజలు అడుగడుగునా హారతులతో ఘనస్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి దళితుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తండ్రి ఆశయాల కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ధిక్కరించి పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న అధికారంలోకి వస్తేనే తామంతా బాగుపడతామని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
జగనన్న అధికారంలోకి రాగానే చేసే ఐదు సంతకాలతో పేదల జీవితాల్లో వెలుగులు వెదజల్లుతాయని స్పష్టం చేశారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు శ్రీవారి పవిత్రతను ప్రపంచదేశాలకు చాటిచెప్పానని కరుణాకరరెడ్డి తెలిపారు. దళితుల కోసం దళిత గోవిందం ఏర్పాటు చేశానన్నారు. తుడా చైర్మన్‌గా అనేక మురికివాడల అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఉప ఎన్నికల్లో ఆదరించి గెలిపించిన తిరుపతి నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నానన్నారు.
రాబోయే ఎన్నికల్లో తిరిగి ప్రజలంతా ఫ్యాను గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న అధికారంలోకి రాగానే తిరుపతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే. బాబు, పోతిరెడ్డి వెంకటరెడ్డి, నల్లాని బాబు, సుబ్బు, నాగరాజు, మణ్యం మునిరెడ్డి, ఆమోస్‌బాబు, ఉమాపతి, కోటూరు ఆంజనేయులు, కే.అమరనాథరెడ్డి, తాల్లూరి ప్రసాద్, బాకా మణి, శివ, బాబు, రాజ, ప్రశాంత్, మహేష్, శీను, మోహన్, బాలకృష్ణ, గురవయ్య పాల్గొన్నారు.