విభిన్నమైన ప్రేమకథ
‘నీకు నాకు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన కథానాయకుడు ప్రిన్స్. ఆ తర్వాత ‘బస్టాప్’, ‘రొమాన్స్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన నటించిన ‘మరల తెలుపనా ప్రియా’ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ద్వారా వాణి యం. కోసరాజు దర్శకురాలిగా, వ్యోమనంది హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీనివాస్ ఊడిగ మాట్లాడుతూ- ‘‘భిన్నమైన వ్యక్తిత్వాలు, నేపథ్యాలున్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే విభిన్న ప్రేమకథా చిత్రమిది.
హైదరాబాద్, హరిద్వార్, రుషికేష్, గోవా, లక్కవరం, రాజమండ్రి, శివపురి తదితర అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరిపాం. శేఖర్ చంద్ర పాటలు ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రం విడుదల తర్వాత వాణి.యం. కోసరాజు పెద్ద డెరైక్టర్ల జాబితాలో చేరుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. పూజారామచంద్రన్, సమీర్, రవివర్మ, సౌమ్య, కల్పలత, పావనీరెడ్డి తదితరులు నటించారు.