March For India
-
'సహనం పుష్కలంగా ఉంది'
ఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ పలువురు రచయితలు, మేధావులు తమ అవార్డులను వెనక్కిస్తున్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శనివారం రాష్ట్రపతి భవన్కు పలువురు బాలీవుడ్ నటులతో ర్యాలీని నిర్వహించారు. దేశంలో సహనానికి వచ్చిన నష్టం ఏమీ లేదనీ, సహనం పుష్కలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతితో భేటీ వివరాలను అనుపమ్ తెలియజేశారు. అవార్డులు ప్రభుత్వం ఇవ్వడం లేదని, దేశ ప్రజలే ఇస్తున్నారని ప్రణబ్ ఈ సందర్భంగా అన్నట్లు తెలిపారు. అంతే కాకుడా మతాలకతీతంగా తయారుచేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల అందరూ గౌరవాన్ని కలిగి ఉండాలని ప్రణబ్ సూచించినట్లు చెప్పారు. అసహనం పేరిట అవార్డులను తిరిగి ఇచ్చే ఘటనలను సహనానికి ప్రతీక అయిన ఇండియా పట్ల కొందరు చేస్తున్న దుష్ప్రచారంగా చూడాలన్నారు. అయితే కొంతమంది చేస్తున్న ఈ నిరసనల పట్ల భారతీయులు ఏకీభవించడం లేదని ఆయన అన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కొందరు అవార్డుల రిటర్న్ ద్వారా తమ నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. తమ ర్యాలీకి ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తెలిపిన అనుపమ్ ఖేర్ ఇది కేవలం భారతీయుల కోసం నిర్వహించిన ర్యాలీ అని అన్నారు. -
'అసహనం'పై అనుపమ్ పోరాటం
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ 'అసహనం'పై పోరాటానికి సంసిద్ధులయ్యారు. 'మార్చ్ ఫర్ ఇండియా' పేరుతో శనివారం ఉదయం ఢిల్లీలోని జనపథ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా మేధావులు, సినీ దిగ్గజాలు, సాధారణ ప్రజలకు ఆహ్వానం పలికారు. దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయంటూ రచయితలు, సినీ దర్శకులు, శాస్త్రవేత్తలు తమకు లభించిన విశిష్ట అవార్డులను వెనక్కి ఇస్తుండటాన్ని అనుపమ్ ఖేర్ మొదటి నుంచీ తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. కేవలం ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునే కొందరు అవార్డులు తిరిగిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇలా చేయడం జాతిని అవమానించినట్లేనని అనుపమ్ ఆరోపిస్తున్నారు. అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీలో సుప్రసిద్ధ నాయకురాలన్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని కలుసుకుని ఒక వినతిపత్రం ఇస్తామని ఖేర్ చెప్పారు. కాగా,ఖేర్ ర్యాలీకి పలువురు సినీ దిగ్గజాలు మద్దతు పలికారు. దర్శకులు మథుర్ భండార్కర్, అశోక్ పండిట్ లు తాము కూడా 'మార్చ్ ఫర్ ఇండియా'లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. మూడు రోజుల కిందటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసి అసహన పరస్థితులపై ఫిర్యాదుచేసిన సంగతి విదితమే.