ఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ పలువురు రచయితలు, మేధావులు తమ అవార్డులను వెనక్కిస్తున్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శనివారం రాష్ట్రపతి భవన్కు పలువురు బాలీవుడ్ నటులతో ర్యాలీని నిర్వహించారు. దేశంలో సహనానికి వచ్చిన నష్టం ఏమీ లేదనీ, సహనం పుష్కలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రపతితో భేటీ వివరాలను అనుపమ్ తెలియజేశారు. అవార్డులు ప్రభుత్వం ఇవ్వడం లేదని, దేశ ప్రజలే ఇస్తున్నారని ప్రణబ్ ఈ సందర్భంగా అన్నట్లు తెలిపారు. అంతే కాకుడా మతాలకతీతంగా తయారుచేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల అందరూ గౌరవాన్ని కలిగి ఉండాలని ప్రణబ్ సూచించినట్లు చెప్పారు.
అసహనం పేరిట అవార్డులను తిరిగి ఇచ్చే ఘటనలను సహనానికి ప్రతీక అయిన ఇండియా పట్ల కొందరు చేస్తున్న దుష్ప్రచారంగా చూడాలన్నారు. అయితే కొంతమంది చేస్తున్న ఈ నిరసనల పట్ల భారతీయులు ఏకీభవించడం లేదని ఆయన అన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కొందరు అవార్డుల రిటర్న్ ద్వారా తమ నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. తమ ర్యాలీకి ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తెలిపిన అనుపమ్ ఖేర్ ఇది కేవలం భారతీయుల కోసం నిర్వహించిన ర్యాలీ అని అన్నారు.