
'అసహనం'పై అనుపమ్ పోరాటం
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ 'అసహనం'పై పోరాటానికి సంసిద్ధులయ్యారు. 'మార్చ్ ఫర్ ఇండియా' పేరుతో శనివారం ఉదయం ఢిల్లీలోని జనపథ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా మేధావులు, సినీ దిగ్గజాలు, సాధారణ ప్రజలకు ఆహ్వానం పలికారు.
దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయంటూ రచయితలు, సినీ దర్శకులు, శాస్త్రవేత్తలు తమకు లభించిన విశిష్ట అవార్డులను వెనక్కి ఇస్తుండటాన్ని అనుపమ్ ఖేర్ మొదటి నుంచీ తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. కేవలం ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునే కొందరు అవార్డులు తిరిగిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇలా చేయడం జాతిని అవమానించినట్లేనని అనుపమ్ ఆరోపిస్తున్నారు. అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీలో సుప్రసిద్ధ నాయకురాలన్న సంగతి తెలిసిందే.
రాష్ట్రపతిని కలుసుకుని ఒక వినతిపత్రం ఇస్తామని ఖేర్ చెప్పారు. కాగా,ఖేర్ ర్యాలీకి పలువురు సినీ దిగ్గజాలు మద్దతు పలికారు. దర్శకులు మథుర్ భండార్కర్, అశోక్ పండిట్ లు తాము కూడా 'మార్చ్ ఫర్ ఇండియా'లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. మూడు రోజుల కిందటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసి అసహన పరస్థితులపై ఫిర్యాదుచేసిన సంగతి విదితమే.