మార్ష్ స్థానంలో మాక్స్వెల్..
రాంచీ: ఆస్ట్రేలియా జట్టులో భుజం గాయం కారణంగా దూరమైన మిచెల్ మార్ష్ స్థానానికి ఇద్దరు ఆటగాళ్లు పోటిపడుతున్నారు. ఆసీస్ డొమెస్టిక్ క్రికెట్లో విక్టోరియా జట్టుకు చెందిన మార్కస్ స్టోయినిస్, గ్లేన్ మాక్స్వెల్ల్లో ఒకరు ఎంపిక అవనున్నారు. ఈ స్థానం కోసం ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య గట్టిపోటి నెలకొంది. వీరిద్దరిలో ఒకరు రాంచీలో గురువారం నుంచి జరిగే టెస్టులో పాల్గొనే అవకాశం ఉంది. నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఇరుజట్ల మద్య పోటి రసవత్తరంగా మారడంతో ఈ ఎంపికకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే జట్టులో స్టార్ ఆటగాళ్లు స్టార్క్, మార్ష్ దూరమవడంతో జట్టు బలహీనమైంది.
పుణేలో ఓడిన భారత్, బెంగళూరులో ప్రతీకారం తీసుకోని దూకుడుగా ఉంది. సిరీస్‌లో ఇరుజట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. అయితే మాక్స్వెల్ చేరికతో జట్టుకు లాభం చేకూరనుంది. మార్కస్ కూడా మార్ష్ లేని లోటు తీర్చుతూ బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆల్‌రౌండర్ ప్రతిభ కనబర్చగలడు. అయితే కొద్ది రోజులుగా మాక్స్వెల్ ఫాంలో లేకపోవడం ఆసీస్‌ను కలవరపెడుతుంది. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కే పరిమితమైన మార్కస్ ఇప్పటి వరకు టెస్టులు ఆడలేదు. 3 వన్డేలు, ఒక టీ20 మినహా అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేదు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఆసీస్ బోర్డు తర్జన భర్జన పడుతుంది.