10 నెలల రాజకీయ సంక్షోభానికి తెరపడింది!
మ్యాడ్రిడ్: స్పెయిన్లో పదినెలల రాజకీయ సంక్షోభానికి తెరపడింది. స్పెయిన్ కన్సర్వేటివ్ ప్రధానమంత్రి మారియానో రాజోయ్ మళ్లీ అధికారంలోకి వచ్చారు. స్పెయిన్ పార్లమెంట్లో ఆయనకు మెజార్టీ ఓట్లు పడటంతో తిరిగి ప్రధానిగా ఎన్నికయ్యారు. 170 చట్టసభ్యులు రాజోయ్కు అనుకూలంగా ఓటు వేయగా..111 మంది వ్యతిరేకంగా..68 మంది గైర్హాజర్ అయ్యారు. గైర్హాజర్ అయిన వాళ్లందరూ సోషలిస్టు పార్టీ(పీఎస్ఓఈ)కి చెందినవారు. ఓటింగ్ పాల్గొనకూడదనే పీఎస్ఓఈ నిర్ణయం , కాంగ్రెస్ మద్దతుతో ఆయన మరోసారి ప్రధాని కుర్చిలో కూర్చోబోతున్నారు.
ధైర్యం, సంకల్పం, బలంతో గత నాలుగేళ్లలో ఎదురైన ఎన్నో సవాళ్లను తాము ఎదుర్కొన్నామని, ప్రస్తుతం కూడా ఇలానే బాధ్యతలు నిర్వహిస్తానని ఫలితాల ప్రకటన అనంతరం ప్రధాని హామీ ఇచ్చారు. తనకు అనుకూలంగా ఓటు వేసిన స్పానిస్ ప్రజలందరినీ తాను అభినందిస్తున్నానని, తనకు ఓటు వేసిన వేయకున్నా ప్రతిఒక్కరికీ తాను సుపరిపాలన అందిస్తానని తెలిపారు తనను ఓడించేందుకు ఆర్థిక విధానాలపై వ్యతిరేకతను సృష్టించారని ఆరోపించారు. ఆర్థిక పునరుద్ధరణ, ఉద్యోగవకాశాల సృష్టిలో నష్టం వాటిల్లించాలని తాము అనుకోవడం లేదని ఓటింగ్ సెషన్ ప్రారంభమయ్యే ముందు ఆయన చట్టసభ్యులకు విన్నపించారు.
ఆర్థికమాంద్యంలో ఉన్న స్పెయిన్ వృద్ధిని మళ్లీ సాధించడమే తన లక్ష్యామన్నారు. ఆర్థిక సంస్కరణలు తొలగిస్తున్నామనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అసంపూర్తి ఎన్నికల ద్వారా దేశాన్ని గత 10 నెలలుగా సంక్షోభంలో నడుపుతున్నారని రాజోయ్ పార్టీ నేతలే తనని విమర్శించారు. గత డిసెంబర్లోను, జూన్లోను ఎన్నికైన రాజోయ్ పాపులర్ పార్టీ, స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడపడానికి మాత్రం తగినన్ని పార్లమెంట్ సీట్లను సంపాదించుకోలేకపోయింది. ఏ రాజకీయ పార్టీ కూడా సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో మరోసారి ఎన్నికలకు వెళ్లాలని స్పెయిన్ యోచించిన సంగతి తెలిసిందే.