‘ఒకట్రెండు రోజుల్లో ఆయిల్ తెట్టు తొలగింపు’
చెన్నై: ఎన్నూర్ కామరాజర్ హార్బర్ లో ఆయిల్ తెట్టు వెలికితీత పనులు ఒకట్రెండు రోజుల్లో పూర్తవుతాయని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చెప్పారు. కేంద్రం, రాష్ట్రాల నుంచి 5,700 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. ఆయిల్ తెట్టు తొలగింపు పనులను ఆదివారం ఆయన స్వయంగా పరిశీలించారు. సముద్ర తీరంలో జంతు, వృక్ష సంపదకు ఎలాంటి నష్టం ఉండదని సీఎం భరోసాయిచ్చారు. నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం చెల్లిస్తామని హామీయిచ్చారు. చమురు ప్రభావిత ప్రాంతంలో పట్టుకున్న చేపల వల్ల ఎలాంటి హానీ లేదని అన్నారు.
ఎన్నూర్ కామరాజర్ హార్బర్‌కు కూత వేటు దూరంలో సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న విషయం తెలిసిందే. క్రూడాయిల్‌తో వచ్చిన నౌకలో ఏర్పడ్డ లీకేజీ చెన్నై సముద్ర తీరాన్ని కలుషితం చేసింది. శనివారం నాటికి 100 టన్నుల తెట్టును తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.