breaking news
marriage dress
-
సిమెంట్ బస్తాలతో పెళ్లిగౌను.. వైరల్!
జీవితంలో మధురస్మృతిగా నిలిచిపోయే ముఖ్యమైన వాటిలో పెళ్లి ప్రత్యేకమైనది. తమ వెడ్డింగ్ డ్రెస్‌పైనే అందరి కళ్లు నిలిచిపోవాలని ప్రతి జంట కలలు కంటుంది. కొంత మంది కోట్లు పోసి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. మరి పేదోడు ఫ్యాషన్ డిజైనర్‌ను భరించగలడా? కాస్త మెదడుకు పని పెడితే మనలోనూ ఫ్యాషన్ డిజైనర్ పుడతాడు. చైనాలోని ఓ మహిళా రైతే దీనికి నిదర్శనం. పేరు లిలీతాన్. గంగ్సూ ప్రావిన్స్‌లో ఓ కుగ్రామంలో నివాసం. రోజూ పొలం పనుల్లో బిజీగా ఉంటుంది. ఓ రోజు వర్షం పడుతుండటంతో ఇంట్లోనే ఉండిపోయింది. ఆ రోజు ఏం చేయాలో తోచలేదామెకు. ఒకప్పుడు ఓ మేగజీన్‌లో చూసిన అందమైన వెడ్డింగ్ గౌన్ గుర్తొచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న 40 సిమెంట్ బస్తాలను తీసుకుని.. 3 గంటల్లో అచ్చం అలాంటి వెడ్డింగ్ డ్రెస్‌నే కుట్టేసింది. సిమెంట్ బస్తాల గౌన్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో లక్షల మంది చూశారు. దీంతో ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఫొటో తెగ హల్చల్ చేస్తోంది. పాపం ఈ గౌనును తన పెళ్లికి ధరించలేకపోయినందుకు తెగ బాధ పడుతోంది. ఎందుకంటే 2012లోనే ఆమె పెళ్లి జరిగింది. -
93 ఏళ్ల బామ్మ ఫేస్ బుక్ పోస్ట్ వైరల్!
సిడ్నీ: ప్రేమకు వయసుతో పని లేదంటారు. ఇందుకు ఆస్ట్రేలియా బామ్మ సిల్వియా ప్రేమ వివాహమే తాజా ఉదాహరణ. 93 ఏళ్ల బామ్మ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. అందుకు కారణం ఆమె చేసిన ఓ చిన్న ప్రయత్నం. తాను పెళ్లి చేసుకోబోతున్నానని, పెళ్లి డ్రెస్ విషయంలో మీరు కాస్త సాయం చేయండని కోరుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేస్తూ పోస్ట్ చేశారు సిల్వియా. ఈ పోస్ట్ ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. 93 ఏళ్ల సిల్వియా, 88 ఏళ్ల ఫ్రాంక్ గత రెండు దశాబ్దాల నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. పలుమార్లు పెళ్లి ప్రతిపాదన తెచ్చినా సిల్వియా అందుకు నో చెప్పేవారు. ఈ క్రమంలో ఇటీవల మరోసారి ఫ్రాంక్ చేసిన పెళ్లి ప్రతిపాదనకు బామ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్రాంక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నేళ్లుగా పెళ్లికి నో చెప్పిన బామ్మగారు, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకునేందుకు ఓ కండీషన్ కూడా పెట్టారు. అదేమంటే.. తన మొదటి భర్త ఇంటిపేరును మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పగా.. ఇది తనకు సమస్యే కాదని స్పష్టం చేయడంతో పెళ్లికి అంగీకరించారు. వచ్చే నెలలో ఫ్రాంక్, సిల్వియా దంపతులు కానున్నారు. ఈ క్రమంలో బామ్మగారు పెళ్లి షాపింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా షాపింగ్ మాల్ లో నాలుగు డ్రెస్సులు ట్రై చేసి, వాటి ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 'నాకు కొంచెం సాయం చేయండి. పెళ్లికి ఏ డ్రెస్సు వేసుకోవాలో సూచించండి' అంటూ సిల్వియా చేసిన పోస్టుకు భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించారు.. కంగ్రాట్స్ అంటూ బామ్మకు అభినందనల వెల్లువ మొదలైంది.