ఉండీ లేనట్టు కనిపించే వంతెన!
వావ్ ఫ్యాక్టర్
ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టుగా కనిపించేలా చేయడాన్ని కనికట్టు అంటారు. ఇందులో మాయమంత్రాలేవీ ఉండవు. చేతివాటమే కీలకం. కానీ ఇక్కడి ఫొటోలు చూస్తే కనికట్టు చాలా చిన్న పదం అనిపించక మానదు. అవతార్ సినిమాలోని వేలాడే కొండల్ని పోలిన ప్రదేశం... రెండు ఎత్తైన శిఖరాల మధ్య ఓ బ్రిడ్జి. అదీ స్టోరీ! చైనాలోని ఝాంగ్గీయాజీ ప్రాంతంలో త్వరలో పూర్తి కానుందీ బ్రిడ్జి. కేవలం గాజు బ్రిడ్జి కావడం ఒక్కటే దీని ప్రత్యేకత కానేకాదు. ఎటు నుంచి చూసినా... అటువైపు ఉన్న సీనరీ మొత్తం పారదర్శకంగా కనిపించడం ఒక విశేషమైతే... అసలు బ్రిడ్జి ఉండీ లేనట్టుగా ఉండటం ఇంకో ముఖ్యమైన అంశం.
మార్టిన్ డుప్లాంటైర్, డాకియాన్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్సు డిజైన్ చేసి నిర్మిస్తున్న ఈ వంతెనను స్టెయిన్లెస్ స్టీల్‌తో, నల్ల రాళ్లతో కడుతున్నారు. ఫొటోలను కొంచెం పరిశీలనగా చూస్తే వాటిల్లో రెండు పొరలున్న విషయం తెలుస్తుంది. అడుగున ఉన్న పొరల్లో పూర్తిగా పారదర్శకమైన పదార్థాన్ని వాడారు. పై అంతస్తులో ఇలాంటి ఏర్పాటేదీ ఉండదు. కాకపోతే నల్లరాళ్లపై దాదాపు రెండు సెంటీమీటర్ల ఎత్తువరకూ నీళ్లు ప్రవహించే ఏర్పాటు చేశారు. ఫలితంగా ఇది ఒక అద్దం మాదిరిగా మారిపోతుంది. పరిసరాల ఛాయాచిత్రాలతో దాదాపుగా కనిపించకుండా పోతుంది. ఏడు నిమిషాలకోసారి ఈ నీటిని తోడివేసి మంచులాంటి నీటి ఆవిరితో నింపుతూంటారు. దీంతో అక్కడ మేఘాల్లో తేలియాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. బ్రిడ్జికి ఒకవైపున ఒక పార్క్, ఓ హోటల్, ఓ వీఐపీ సూట్ వంటి ఏర్పాట్లు ఉన్నాయి.