Martyrs Monument
-
ఖానాపూర్‌లో నేటికీ చెదరని జ్ఞాపకాలు
సాక్షి, ఖానాపూర్ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో నేటికి చెదరని నెత్తుటి చేదుజ్ఞాపకాలు.. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసిన అన్నల అలజడి... తుపాకీ చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నక్సలైట్లు విధ్వంస చర్యలు జరుగుతూనే ఉండేవి. తరుచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి... నక్సలైట్ల కవ్వింపు చర్యలు తిప్పికొట్టే ప్రయత్నాల్లో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు మరువలేనివి. ఈ క్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. దాదాపు 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్‌లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలి అయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఎర్పరచుకున్నారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహ చర్యలకు శ్రీకారం చుట్టారు. సంఘటనల వివరాలివే.. 1987 ఆగస్టు 18న కడెం మండలం అల్లంపల్లి క్యాంపునకు పోలీసులు నడిచి వెళ్తుండగా అద్దాల తిమ్మాపూర్ వద్ద 30 మంది నక్సలైట్లు పకడ్బందీ పథకం ప్రకారం మాటువేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. 1989 పిభ్రవరి ఒకటిన జరిగిన సంఘటకు ఒక రోజు ముందు ఖానాపూర్ మండలంలోని రాజూరా గ్రామంలో నక్సలైట్లు దోపిడికి పాల్పడ్డారు. దోపిడి నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికి వెళ్తుండగా కడెం మండలం సింగాపూర్ గ్రామ సమీపంలో పకడ్బందీ వ్యూహంతో నక్సలైట్లు పోలీసుల జీపును పేల్చివేశా రు. ఎస్ఐ ఖాదర్‌ఉల్‌హక్, ఆరుగురు కానిస్టేబుళ్లు జీ. బాపురావు, ఎండీ జలీల్, షేక్‌హైదర్, వేణుగోపాల్, బోజరావు, ఎస్. మోహన్‌దాస్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డాడు. 1999 డిసెంబర్ ఐదున కడెం మండలంలో బందోబస్తుకు వెళ్లి వస్తుండగా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామసమీపంలో నక్సలైట్లు రిమోట్‌కంట్రోలర్ సహాయంతో పోలీసు జీపును పేల్చివేశారు. ఎస్ఐ మల్లేశ్‌తో పాటు కానిస్టేబుల్, జీపు డ్రైవర్ దుర్మరణం చెందారు. ఖానాపూర్‌లో అమరుల స్థూపం ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో అమవీరుల స్మారాకర్థం స్థూపం లేకపోవడంతో స్టేషన్ ఆవరణలోని ఓ వేపచెట్టు కింద శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచేవారు. అనంతరం 2008 సంవత్సరంలో అప్పటి సీఐ, ఎస్ఐలు స్మారక స్థూప నిర్మాణానికి కృషి చేశారు. ప్రస్తుత సీఐజయరాంనాయక్‌తో పాటు ఎస్ఐ గోగికారి ప్రసాద్‌లు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. -
వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
జూన్ 1 నుంచి 7 వరకు ఉత్సవాలు వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు మార్గదర్శకాలు జారీ చేసిన సాంస్కృతిక శాఖ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో వివిధ రంగాల్లో విశేష కృషి, అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రముఖులను అవార్డులతో సత్కరించాలని అధికారులకు సూచించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం జిల్లా కలెక్టర్లకు జారీ చేశారు. జూన్ ఒకటో తేదీన రాత్రి స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలతో పాటు రాష్ట్ర అవతరణ సూచికగా అర్ధరాత్రి బాణసంచా పేలుస్తారు. 2వ తేదీన జిల్లా కేంద్రాల్లో అమర వీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులు అర్పించటంతో పాటు అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు, ఎన్సీసీ పరేడ్ నిర్వహించి వివిధ రంగాల్లో ప్రముఖులను అవార్డులతో సత్కరిస్తారు. వారం రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగలా ఉత్సవాలు జరుపుతారు. అన్ని ప్రభుత్వ భవనాలకు విద్యుత్ దీపాలంకరణ చేస్తారు. స్థానిక కవులు, కళాకారులతో సాహిత్య కార్యక్రమాలు, అవధానాలు, కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, ఫొటో ప్రదర్శనలు, తెలంగాణ నేపథ్యంతో వచ్చిన సినిమాల ప్రదర్శన.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, చరి త్ర వారసత్వం, అభివృద్ధిపై విశ్వవిద్యాలయాల సమన్వయంతో సెమినార్లు, వర్క్‌షాపులు, తెలంగాణ రుచులు, హస్తకళా శిబిరాలు, హెరిటేజ్ వాక్, ప్రత్యేక రన్, శాస్త్రీయ జానపద కళారూపాలు, సంగీత నృత్య రూపకాల ప్రదర్శనలు, ఖవ్వాలీ, గజల్స్‌ను నిర్వహిస్తారు. ముగింపు వేడుకల్లో శోభాయాత్ర జూన్ 7న ముగింపు వేడుకల్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధుల సారథ్యంలో ఊరేగింపులు, శోభాయాత్ర నిర్వహిస్తారు. సౌండ్ అండ్ లైట్ షో నిర్వహించి బాణసంచా పేలుస్తారు. రాష్ట్ర రాజధానిలో జరిగే భారీ ముగింపు వేడుకలకు ప్రతి జిల్లా నుంచి 500 మంది కళాకారులను రప్పిస్తారు. ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ ఉపాధ్యక్షులుగా, కలెక్టర్ కన్వీనర్‌గా ఉండే కమిటీ జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో అవార్డులను ఎంపిక చేస్తుంది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు ఈ కమిటీలో కో ఆప్టెడ్ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో పది మంది, మున్సిపాలిటీల్లో 15 మంది, కార్పొరేషన్ పరిధిలో 20 మంది ప్రముఖులకు రూ.10,116 చొప్పున నగదును పారితోషికంగా అందిస్తారు. జిల్లా స్థాయిలో 30 మంది ప్రముఖులకు రూ.51,116 చొప్పున అందిస్తారు. ఉత్తమ రైతు, ఉపాధ్యాయుడు, అర్చకుడు, అంగన్వాడీ కార్యకర్త, సామాజిక సేవకుడు, ప్రభుత్వ ఉద్యోగి, వైద్యుడు, జర్నలిస్టు, న్యాయవాది, ఎన్జీవో, క్రీడాకారుడు, సాహితీవేత్త, కళాకారు లు తదితర కేటగిరీల్లో మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అవార్డులుంటాయి. -
విక్రాంత్ నుఅమరుల స్మారక చిహ్నంగా మార్చండి
న్యూఢిల్లీ : కాలం చెల్లిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను అమరుల స్మారక చిహ్నంగా మార్చాలని మహారాష్ట్ర నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ, శివసేన ఎంపీల బృందం కేంద్రాన్ని కోరింది. ‘విక్రాంత్ ను కాపాడండి, దానిని యుద్ధ మ్యూజియం ‘అమరుల స్మారకం’గా మార్చండి. తుక్కుగా చేయాలన్న ప్రతిపాదనను ఆపేయండి. దారుఖానా చెత్త కేంద్రానికి తరలింపును నిలిపివేయండి. అమరుల స్మారక చిహ్నంగా మార్చే ప్రతిపాదనను మరోసారి పరిగణనలోకి తీసుకోండి’ అని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్.కె.మాథుర్‌కు 18 మంది ఎంపీలు లేఖ రాశారు. 1997లో ఓడ సామర్థ్యం తగ్గిపోవడంతో దాని భవితవ్యం డోలాయమానంలో పడింది. ఒకప్పుడు దేశానికి ఎంతో గర్వ కారణమైన ఈ పాత ఓడను ముంబై నావికా డాక్ యార్డ్ నుంచి దారుఖానాలోని షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తరలించాలని మే 16న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. విక్రాంత్ యుద్ధ నౌక చాలా పురాతనమైపోయిందని, బాగా దెబ్బతిని శక్తి విహీనమైపోయిందని, దాన్ని మరమ్మతులు చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం తెలిపిన తరువాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది. దారుఖానా షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త కిరణ్ పైగాంకర్ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లారు. విక్రాంత్‌ను మ్యూజియంగా మార్చాలని ఆయన తన పిటిషన్లో అభ్యర్థించారు. అతని అభ్యర్థనపై స్పందించిన కోర్టు, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. యధాస్థితిని కొనసాగించాలని మే 5న చెప్పింది. అయితే దాన్ని తుక్కుగా చేయబోమని, భద్రత రీత్యా ఐఎన్ఎస్ విక్రాంత్‌ను వేరే ప్రాంతానికి మాత్రమే తరలిస్తామని ప్రభుత్వం చెప్పడంతో కోర్టు అందుకు అనుమతించింది. అయితే నిధుల కొరత వల్ల తాము మ్యూజియంను నిర్వహించలేమని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే వేలం వేసింది. 63 కోట్ల రూపాయలతో ఐబీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రాంత్‌ను దక్కించుకుంది.