వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
జూన్ 1 నుంచి 7 వరకు ఉత్సవాలు
వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు
మార్గదర్శకాలు జారీ చేసిన సాంస్కృతిక శాఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో వివిధ రంగాల్లో విశేష కృషి, అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రముఖులను అవార్డులతో సత్కరించాలని అధికారులకు సూచించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం జిల్లా కలెక్టర్లకు జారీ చేశారు. జూన్ ఒకటో తేదీన రాత్రి స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలతో పాటు రాష్ట్ర అవతరణ సూచికగా అర్ధరాత్రి బాణసంచా పేలుస్తారు. 2వ తేదీన జిల్లా కేంద్రాల్లో అమర వీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులు అర్పించటంతో పాటు అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు, ఎన్‌సీసీ పరేడ్ నిర్వహించి వివిధ రంగాల్లో ప్రముఖులను అవార్డులతో సత్కరిస్తారు.
వారం రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగలా ఉత్సవాలు జరుపుతారు. అన్ని ప్రభుత్వ భవనాలకు విద్యుత్ దీపాలంకరణ చేస్తారు. స్థానిక కవులు, కళాకారులతో సాహిత్య కార్యక్రమాలు, అవధానాలు, కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, ఫొటో ప్రదర్శనలు, తెలంగాణ నేపథ్యంతో వచ్చిన సినిమాల ప్రదర్శన.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, చరి త్ర వారసత్వం, అభివృద్ధిపై విశ్వవిద్యాలయాల సమన్వయంతో సెమినార్‌లు, వర్క్‌షాపులు, తెలంగాణ రుచులు, హస్తకళా శిబిరాలు, హెరిటేజ్ వాక్, ప్రత్యేక రన్, శాస్త్రీయ జానపద కళారూపాలు, సంగీత నృత్య రూపకాల ప్రదర్శనలు, ఖవ్వాలీ, గజల్స్‌ను నిర్వహిస్తారు.
ముగింపు వేడుకల్లో శోభాయాత్ర
జూన్ 7న ముగింపు వేడుకల్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధుల సారథ్యంలో ఊరేగింపులు, శోభాయాత్ర నిర్వహిస్తారు. సౌండ్ అండ్ లైట్ షో నిర్వహించి బాణసంచా పేలుస్తారు. రాష్ట్ర రాజధానిలో జరిగే భారీ ముగింపు వేడుకలకు ప్రతి జిల్లా నుంచి 500 మంది కళాకారులను రప్పిస్తారు. ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ ఉపాధ్యక్షులుగా, కలెక్టర్ కన్వీనర్‌గా ఉండే కమిటీ జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో అవార్డులను ఎంపిక చేస్తుంది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు ఈ కమిటీలో కో ఆప్టెడ్ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో పది మంది, మున్సిపాలిటీల్లో 15 మంది, కార్పొరేషన్ పరిధిలో 20 మంది ప్రముఖులకు రూ.10,116 చొప్పున నగదును పారితోషికంగా అందిస్తారు. జిల్లా స్థాయిలో 30 మంది ప్రముఖులకు రూ.51,116 చొప్పున అందిస్తారు. ఉత్తమ రైతు, ఉపాధ్యాయుడు, అర్చకుడు, అంగన్‌వాడీ కార్యకర్త, సామాజిక సేవకుడు, ప్రభుత్వ ఉద్యోగి, వైద్యుడు, జర్నలిస్టు, న్యాయవాది, ఎన్‌జీవో, క్రీడాకారుడు, సాహితీవేత్త, కళాకారు లు తదితర కేటగిరీల్లో మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అవార్డులుంటాయి.