సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ వచ్చాక కళలు వర్థిల్లుతున్నాయి. ఇది నూటికి నూరుపాళ్లూ కళల రాజ్యం... కళాకారుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం... కళాకారులు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. ఇవీ ప్రభుత్వపెద్దలు తరచూ చెప్పే మాటలు. కానీ, అటువంటి చోట కళాకారులు ఆందోళనకు దిగటం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఒగ్గు, జానపద కళాకారులు శుక్రవారం ధర్నా చేశారు.
పూట గడవక అల్లాడుతున్నానని ప్రభుత్వ పురస్కార గ్రహీత 12 మెట్ల కిన్నెర మొగిలయ్య ఇటీవల మీడియా ఎదుట గోడువెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయా జిల్లాల నుంచి ఒగ్గు, జానపద కళాకారులు తరలివచ్చి ఆందోళనకు దిగారు. అనంతరం వినతిప్రతం అందజేసేందుకు ఒగ్గు కళాకారుల సంఘం ప్రతినిధి బృందం భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోకి వెళ్లింది. ‘బయటనే మాట్లాడుకొందాం పదా’అని ఆ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ధర్నా వద్దకు వచ్చి అందర్నీ సముదాయించారు. రవీంద్రభారతి సమావేశమందిరంలోకి తీసుకెళ్లి సమస్యలను చర్చించారు.
నెల రోజుల్లో పరిష్కారం
కళాకారులు కోరినట్లుగా సెప్టెంబర్ 15న ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ గుర్తింపు కార్డులు అక్కడికక్కడే అందజేస్తామని భాషా, సాంస్కృతిక శాఖ ౖడైరెక్టర్ హరికృష్ణ అన్నారు.. కళాకారులకు శిక్షణ కోసం ఒగ్గుకథ సమ్మేళనం ఏర్పాటు చేస్తామన్నారు. పింఛన్లు లిస్టు ప్రకారం అర్హులకు అందజేస్తూ వస్తామని హామీనిచ్చారు. ఒగ్గు కళాకారుల సామగ్రి, ఇన్సూరెన్స్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆయన హామీనిచ్చారు.
రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ప్రమాదవశాత్తు మరణించిన కళాకారులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఒగ్గు కళాకారులకు ఒగ్గు కథ సామగ్రి, డోళ్లు, గజ్జెలు, నపీర, తాళాలు, దుస్తులు ఉచితంగా ఇవ్వాలి.
– బెల్లం పరమేష్, ఒగ్గు కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వాలి..
ప్రతి జిల్లాలో ఒగ్గు, జానపద కళాకారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వాలి. పింఛన్ల సంఖ్యను పెంచి అర్హులైన వారందరికీ తక్షణమే మంజూరు చేయాలి. కళాకారులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. – చేవాళ్ల శంకరయ్య, ఒగ్గు కళాకారుడు
సీఎం రానిస్తలేడు...
అందరు పోరాడితే తెలంగాణ వచ్చింది. మన రాజ్యమే అనుకున్నాం. ఏమి లాభం.. ఏడాది కిందట ఆన్‌లైన్ పద్ధతిన కళాకారులకు గుర్తింపు కార్డులిస్తమన్నరు. ఒక్కరికి కూడా కార్డు రాలేదు. సాంస్కృతిక సారథిలో మాలో ఒక్కరికి కూడా ఉద్యో గం రాలేదు. సీఎం కేసీఆర్‌కు బాధల్ని చెప్పుకొందామంటే రానిస్తలేడు. క్యాంప్ ఏర్పాటు చేసి ఒగ్గు కళాకారులకు గుర్తింపుకార్డులు అక్కడికక్కడే ఇవ్వాలి. ‘సారథి’లో రిజర్వేషన్లు అమలు చేయాలి. – కె. సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు, ఒగ్గు, జానపద కళాకారుల సంఘం.
పింఛన్ ఇయ్యం పో అంటున్నరు
జనగాం డీపీఆర్‌వో కార్యాలయానికి పింఛన్ కోసం వెళ్లితే ‘నీకు రాదు, ఇయ్యం పో’ అంటున్నారు. 50 ఏళ్లు దాటిన ఒగ్గు కళాకారులందరికీ నెలకు రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలి. పథకాల ప్రచార కార్యక్రమాల్లో మాకు కూడా అవకాశం కల్పించాలి. –సీహెచ్ అంజయ్య, డోళ్ల విన్యాసం కళాకారుడు
Comments
Please login to add a commentAdd a comment