maruteru
-
గిట్టుబాటు ధర పోరాటం ఉధృతం
– వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి పెనుమంట్ర : వరి ధాన్యానికి తగిన గిట్టుబాటు ధర సాధించేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నేతలను ఢిల్లీ తీసుకుకెళ్లి ధాన్యానికి మద్దతు ధర సాధించేందుకు కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని సీఎం చంద్రబాబుకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆయనకు వ్యవసాయ రంగంపై ఉన్న చులకన భావనతో స్పందిచడం లేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రం దేశంలోనే వ్యవసాయానికి అనుకూలమైన పెద్దరాష్ట్రంగా అవతరించిందన్నారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలకు ఆకలి చావులు తప్పడం లేదన్నారు. వరి ధాన్యం ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు క్వింటాల్‌కు రూ.300 కలిపి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు దానిని గాలికొదిలేశారన్నారు. క్వింటాల్‌కు రూ.1,900 ఖర్చవుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ మొత్తంపై బోనస్ ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. కమీషన్లు ఇస్తేనే పవర్ టిల్లర్లు కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో పవర్ టిల్లర్‌కు రూ.10 వేలు తీసుకుని ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇస్తున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. గ్రామ సభలు నిర్వహించి నిజమైన వ్యవసాయదారులను గుర్తించి పవర్ టిల్లర్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఎమ్మెల్యేల లబ్ధే ప్రధాన ధ్యేయంగా పవర్టిల్లర్లు, ఇతర యంత్రాలు పంపిణీ చేస్తోందని విమర్శించారు. పట్టిసీమ నిధులు లోకేష్ ఖాతాలోకి.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండా పట్టిసీమ పేరుతో సీఎం తనయుడు లోకేష్ ఖాతాలోకి నిధులు మళ్లించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. పార్టీ ఫిరాయించి ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన వారికి ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు, డ్వాక్రా సంఘాలకు బ్యాంకు రుణాలు అందటం లేదన్నారు. రుణమాఫీ హామీ అమలుకాక, వడ్డీల భారం పెరిగిపోయి డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ 15 అస్లెంబ్లీ స్థానాలను కానుకగా ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టుమని 15 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమ ఒక్కటైనా స్థ్ధాపించలేక పోయారని ధ్వజమెత్తారు. -
మేలైన వంగడాల కోసం కృషి
మార్టేరు (పెనుమంట్ర): అధిక దిగుబడినిచ్చే మేలైన రకాల వంగడాలు మరిన్ని సృష్టించడానికి శాస్త్రవేత్తల కృషి అవిరామంగా కొనసాగుతూనే ఉందని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ చానల్సర్ డాక్టర్ టి.విజయకుమార్ అన్నారు. ఇందుకు మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం చక్కని వేదికగా ఉపకరిస్తోందని చెప్పారు. మార్టేరు వరి పరిశోధనా స్థానంలో శనివారం జరిగిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఎంపీ, పాలకవర్గ సభ్యుడు కె.రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ రైతుకు లాభసాటి సాగు అనిపించేలా యాజమాన్య పద్ధతుల్లో నూతన ఒరబడిని తీసుకురావాలని శాస్త్రవేత్తలకు సూచించారు. విజయనగరం ఎమ్మెల్యే, పాలక మండలి సభ్యురాలు మీసాల గీత మాట్లాడుతూ వ్యవసాయంపై యువత ఆకర్షితులయ్యేలా కళాశాలల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వాలని సూచించారు. కొవ్వూరు ఎమ్మెల్యే, పాలకమండలి సభ్యుడు కేఎస్ జవహర్ మాట్లాడుతూ రైతుల అనుభవానికి శాస్త్రవేత్తల విజ్ఞానం తోడు కావాలన్నారు. స్థానికంగా విడుదల చేసిన శ్రీధతి, తరంగిణి, భీమ తదితర విత్తనాల గుణగణాలను మార్టేరు పరిశోధనా సంస్థ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ వివరించారు. ఎన్‌ఏఏఆర్‌ఎం డైరెక్టర్ డి.రామారావు, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి వై.రామకృష్ణ, డాక్టర్ వి.దామోదర్‌నాయుడు, ప్రొఫెసర్లు జీవీ నాగేశ్వరరావు, ఐ.భవానీదేవి, ఎస్ఆర్ కోటేశ్వరరావు, మేకల లక్ష్మీనారాయణ మాట్లాడారు.అనంతరం పాలక మండలి కోసం కొత్తగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరాన్ని వీసీ విజయ్‌కుమార్ ప్రారంభించారు. క్షేత్రస్థాయి పరిశీలన ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే జవహర్ సంస్థ ప్రాంగణంలోని వరినాట్ల ప్రదర్శనలను తిలకించారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేపట్టిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులను ఎంపీ అభినందించారు. ముందుగా ఎంపీ రామ్మోహన్నాయుడుకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్వాగతం పలికారు.