గిట్టుబాటు ధర పోరాటం ఉధృతం
గిట్టుబాటు ధర పోరాటం ఉధృతం
Published Sat, Oct 29 2016 10:26 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
పెనుమంట్ర :
వరి ధాన్యానికి తగిన గిట్టుబాటు ధర సాధించేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నేతలను ఢిల్లీ తీసుకుకెళ్లి ధాన్యానికి మద్దతు ధర సాధించేందుకు కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని సీఎం చంద్రబాబుకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆయనకు వ్యవసాయ రంగంపై ఉన్న చులకన భావనతో స్పందిచడం లేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రం దేశంలోనే వ్యవసాయానికి అనుకూలమైన పెద్దరాష్ట్రంగా అవతరించిందన్నారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలకు ఆకలి చావులు తప్పడం లేదన్నారు. వరి ధాన్యం ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు క్వింటాల్‌కు రూ.300 కలిపి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు దానిని గాలికొదిలేశారన్నారు. క్వింటాల్‌కు రూ.1,900 ఖర్చవుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ మొత్తంపై బోనస్ ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు.
కమీషన్లు ఇస్తేనే పవర్ టిల్లర్లు
కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో పవర్ టిల్లర్‌కు రూ.10 వేలు తీసుకుని ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇస్తున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. గ్రామ సభలు నిర్వహించి నిజమైన వ్యవసాయదారులను గుర్తించి పవర్ టిల్లర్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఎమ్మెల్యేల లబ్ధే ప్రధాన ధ్యేయంగా పవర్‌టిల్లర్లు, ఇతర యంత్రాలు పంపిణీ చేస్తోందని విమర్శించారు.
పట్టిసీమ నిధులు లోకేష్ ఖాతాలోకి..
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండా పట్టిసీమ పేరుతో సీఎం తనయుడు లోకేష్ ఖాతాలోకి నిధులు మళ్లించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. పార్టీ ఫిరాయించి ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన వారికి ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు, డ్వాక్రా సంఘాలకు బ్యాంకు రుణాలు అందటం లేదన్నారు. రుణమాఫీ హామీ అమలుకాక, వడ్డీల భారం పెరిగిపోయి డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ 15 అస్లెంబ్లీ స్థానాలను కానుకగా ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టుమని 15 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమ ఒక్కటైనా స్థ్ధాపించలేక పోయారని ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement