ఈ గుండె మీద పచ్చచొక్కా పడదు | Tdp govt trobles to ysrcp activists | Sakshi
Sakshi News home page

ఈ గుండె మీద పచ్చచొక్కా పడదు

Published Fri, Aug 24 2018 12:03 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

Tdp govt trobles to ysrcp  activists - Sakshi

కంటికి రెప్పలా చూసుకుంటూ, నాగిరెడ్డిని నడిపిస్తున్న భార్య లక్ష్మీదేవి

నాలుగేళ్ల నుంచి.. ఐదువేళ్లూ నోట్లోకెళ్లడం లేదు! పెన్షన్‌ కోసం ఎక్కని గడప లేదు. మొక్కని అధికారీ లేడు! అయినా సరే.. జన్మ వెక్కిరించినా భూమి మింగేసినా తన గుండెపై పచ్చచొక్కా పడదంటున్నాడు నాగిరెడ్డి.

ఎనభై ఏళ్లు పైబడిన వృద్ధుడు నాగిరెడ్డి. కాలు దెబ్బతిని, కంటిచూపూ పోవడంతో పాత ప్రభుత్వంలో ఆయనకు నెలనెలా దివ్యాంగుల పెన్షన్‌ వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చీ రాగానే దానిని రద్దు చేసింది. నాలుగేళ్లుగా పెన్షన్‌ కోసం తిరుగుతున్నాడు. కలెక్టర్‌ ఓకే చేసినా, జన్మభూమి కమిటీ కరుణ చూపకపోవడంతో ఈనాటికీ పెన్షన్‌ రాలేదు. ‘పార్టీ మారితే ఇస్తాం.. పెన్షన్‌ ఇస్తాం’ అంటున్నారు కానీ, పెన్షన్‌ కోసం పచ్చచొక్కా వేసుకునేది లేదని ధీమాగా చెబుతున్న నాగిరెడ్డిని ‘సాక్షి’ కలిసినప్పుడు అసలేం జరిగిందో వివరంగా చెప్పారు.  ‘‘మాది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామం. నాపేరు బోదవరపు నాగిరెడ్డి, నాకు 81 సంవత్సరాలు. నా భార్య లక్ష్మీదేవి. పిల్లలిద్దరూ పొట్ట నింపుకోవడానికి పనులు వెతుక్కుంటూ వెళ్లిపోయారు. నాకున్న కొద్దిపాటి వ్యవసాయభూమిలో తిండి గింజలు పండుతాయి. పెన్షన్‌ డబ్బుతో ఇతర ఖర్చులు గడిచిపోతుండేవి. ఓ రోజు పిఠాపురం నుంచి మా ఊరికి వస్తుండగా ఆటో ప్రమాదంలో నా కాలు విరిగిపోయింది. ఓ వారం హాస్పిటల్‌లో వైద్యం చేయించుకుని ఐదు నెలల పాటు మంచంలోనే ఉన్నాను. కాలు కొద్దికొద్దిగా బాగవుతూ వచ్చింది కానీ కళ్లు కనిపించడం మానేశాయి. ఉన్న భూమిని తాకట్టు పెట్టి కంటి ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఐదు లక్షలు ఖర్చయ్యాయి. కానీ చూపు మాత్రం రాలేదు. డాక్టర్లు పరీక్షించి నూరుశాతం అంధత్వం అని, చూపు రాదని చెప్పారు. ఒక కాలు సరిగ్గా లేక, రెండు కళ్లకు చూపులేని స్థితిలో ఇక నేనే పని చేయగలను? అప్పుడున్న ప్రభుత్వం నా వృద్ధాప్య పెన్షన్‌ను దివ్యాంగుల పెన్షన్‌గా మార్చడంతో నెలకు ఐదువందలు వచ్చేవి. ఆ ఐదొందల్లోనే మందుల ఖర్చు జరిగిపోయేది. 

ఆశ అడియాసైంది
దివ్యాంగుల పెన్షన్‌ వెయ్యి రూపాయలు చేస్తామని చెప్పిన నాయకుల మాటలు నమ్మాం. కొండంత ఆశతో ఎదురు చూశాం. అయితే కొత్త ప్రభుత్వం నా పెన్షన్‌ని రద్దు చేసింది. అప్పటి వరకు వస్తున్న ఐదొందలు కూడా రావడం లేదు. అదేంటని పంచాయితీ ఆఫీస్‌కెళ్లి అడిగాను. మళ్లీ కొత్తగా వేలిముద్రలు తీసుకుని, ‘పెన్షన్‌ వస్తుంది వెళ్లు’ అన్నారు.  నేను, నా భార్య మూడు నెలల పాటు రోజూ పంచాయతీ ఆఫీస్‌ దగ్గర పడిగాపులు పడ్డాం. ఏడాది గడిచినా పెన్షన్‌ రాలేదు. పిఠాపురం మండలాఫీస్‌లో ఎన్నోసార్లు అర్జీలిచ్చాం. ఇలా కాదని, కాకినాడకు వెళ్లి కలెక్టర్‌ ఆఫీస్‌కెళ్లాం. గ్రీవెన్స్‌ సెల్‌లో ఇరవైకి పైగా అర్జీలిచ్చాం. ఓ రోజు కలెక్టర్‌గారు మా ఊరి అధికారికి ఫోన్‌ చేసి ‘అన్ని అర్హతలున్న ఇతడికి పెన్షన్‌ ఎందుకివ్వలేదు, వెంటనే ఏర్పాటు చేయండి’ అని మా కళ్ల ముందే చెప్పారు. అధికారితో మాట్లాడిన తర్వాత మాతో ‘మీ ఊరి అధికారికి చెప్పాను, పెన్షన్‌ ఇస్తారు వెళ్లండి’ అన్నారు. ‘స్వయంగా కలెక్టర్‌గారే చెబితే ఇక అడ్డేముంటుంది, నాకు పెన్షన్‌ వచ్చేస్తుంద’నే కొండంత నమ్మకంతో ఇంటికి వచ్చాం. అన్నట్లు మరుసటి రోజు పంచాయతీ ఆఫీస్‌ నుంచి పిలుపు వచ్చింది. సంతోషంగా వెళ్లాను. ‘కొత్త లిస్టులో తొలిపేరు నీదే’నంటూ లిస్టు చూపించారు. ఒకటో తేదీన వచ్చి పెన్షన్‌ డబ్బు తీసుకోమని కూడా చెప్పారు. అన్నట్లుగానే ఒకటో తేదీన వెళ్లాను. ‘డబ్బులు వచ్చాయి. అయితే గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్లి వారి అనుమతి పొందాలి. వారి అనుమతితో వస్తే డబ్బులిస్తాం’ అన్నారు. 

అక్కడకు వెళ్తే..
జన్మభూమి కమిటీ సభ్యుల్ని కలిశాను. వాళ్లన్న మాట వినగానే మనసు చివుక్కుమన్నది. ‘నువ్వు వైఎస్‌ఆర్‌ పార్టీ కదా, నీకు పెన్షన్‌ ఇవ్వం, ఎమ్మెల్యేని కలువు పో’ అన్నారు. మరోమాటకు కూడా తావివ్వలేదు. నేను, నా భార్య పిఠాపురం ఎమ్మెల్యే వర్మను కలిసి మా పరిస్థితి చెప్పి ప్రాధేయపడ్డాం. ఆయనేమో ‘నీకు పెన్షన్‌ ఇస్తారు, ఎంపీడీవోను కలువు’ అన్నారు. అలాగే ఎంపీడీవోను కూడా కలిస్తే, పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ‘జన్మభూమి కమిటీ వాళ్లు చెబితేనే పెన్షన్‌ వస్తుంది. ఇక ఎంతమంది చుట్టూ తిరిగినా రాద’ని కరాఖండిగా అన్నారాయన. మళ్లీ పంచాయతీ కార్యదర్శి దగ్గరకెళ్లాను. ‘నువ్వు వైఎస్‌ఆర్‌సీపీ మనిషివట, నువ్వు తెలుగుదేశంలోకి వచ్చే వరకు నీకు పెన్షన్‌ ఇచ్చే అవకాశం లేదు’ అన్నాడు ఆయన. ఇలా నాలుగేళ్లు గడిచిపోయాయి. 2014 ఎన్నికల రోజుల్లో నా దగ్గరకు కొందరు వచ్చి ‘నీకు డబ్బిస్తాం, పార్టీ మారు’ అన్నప్పుడే వాళ్లకు కచ్చితంగా ఒకటే మాట చెప్పాను. ‘వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో కలిసి అడుగులేసిన వాడిని, ఈ రోజు ఆయన లేకపోయినా ఆయన బాటలోనే నడుస్తాను’ అని. ఇప్పుడు పెన్షన్‌ ఇవ్వకుండా నన్ను ఏడిపించిన తర్వాత నేను పార్టీ మారుతానా? ఈ నాలుగేళ్లుగా కళ్లు, కాళ్లు సరిలేకపోయినా నా భార్య సహాయంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. వాళ్ల కాళ్లు పట్టుకుంటే పెన్షన్‌ ఇస్తారు, లేకపోతే ఇవ్వరని చెబుతున్నారు. అయినా సరే నా పోరాటం ఇలాగే సాగుతుంది  తప్ప నా సిద్ధాంతాన్ని మార్చుకునేది లేదు. డబ్బు లేకపోతే పస్తులుంటాం. ముసలోళ్లను ఏడిపించిన పాపం ఊరికే పోదు’’ అని ఎంతో ఆవేదనగా తన గోడు వెళ్లబోసుకున్నాడు నాగిరెడ్డి. పెద్ద పెద్ద మాటలు చెబుతున్న ఎ.పి. ప్రభుత్వం ఇంత చిన్న పని ఎందుకు చేయలేకపోతోందో స్పష్టంగా తెలిశాక.. వచ్చే ప్రభుత్వంలో తనకు తప్పకుండా పెన్షన్‌ వస్తుందన్న ధీమాతో ఉన్నాడీ పెద్దాయన.


ఇక ఆ బిడ్డ చేత్తోనే తీసుకుంటాం
వైఎస్‌ఆర్‌ బిడ్డ జగన్‌ పిఠాపురం వచ్చే రోజు కోసం ఎదురు చూసి, ఆయన్ని కలిసి మా గోడు చెప్పుకున్నాం. ఆయన మా బాధలు విని కన్న బిడ్డలాగే దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. ఇక పెన్షన్‌ ఇమ్మని ఎవరినీ అడగం, ఆ బిడ్డ చేత్తోనే తీసుకుంటాం. 
– లక్ష్మీదేవి, నాగిరెడ్డి భార్య

సిఫార్సు లేకనే పెన్షన్‌ ఆగింది
నాగిరెడ్డి పెన్షన్‌కు అన్నివిధాలుగానూ అర్హుడే. ఆయనకు పెన్షన్‌ మంజూరయ్యింది కూడా. అయితే జన్మభూమి కమిటీ.. ఆమోదం ఇవ్వడం లేదు. ఆయన వెళ్లి వారిని అడిగినా కూడా వారు సిఫార్సు చేయడం లేదు. దీంతో నాగిరెడ్డి పెన్షన్‌ ఆగిపోయింది. అధికారికంగా డబ్బులు విడుదలయ్యాయి. అయినా ఆ డబ్బును ఆయనకు ఇవ్వలేకపోతున్నాం. 
– కె. సుబ్బారావు, ఎంపీడీఓ, పిఠాపురం 
– వెలుగుల సూర్య వెంకట సత్య వరప్రసాద్, 
సాక్షి, పిఠాపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement