masaipeta
-
ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే!
తల్లిదండ్రులకు టాటా చెప్పి, అమ్మమ్మలకు బాయ్ చెప్పి పాఠశాల బస్సెక్కి బయల్దేరిన ఆ పసివాళ్లు తరలిరాని లోకాలకు వెళ్లారు. తమను తీసుకెళ్తున్న ఆ వాహనమే మృత్యు శకటమవుతుందని, అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్తున్నామని తెలియని ఆ పసిమనసులు తోటి మిత్రులతో ముచ్చటిస్తున్నారు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో కాపలా లేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న వారి బస్సును అటువైపుగా వస్తున్న రైలు ఢీకొట్టడం, 16 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. సరిగ్గా ఇదే రోజు (జులై 24), ఆరేళ్ల క్రితం మాసాయిపేట వద్ద జరిగిన ఈ ఘటన నాలుగు గ్రామాల్లోని పద్దెనిమిది కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఈ దుర్దినాన్ని తలచుకుని కన్నీంటిపర్యంతమవుతున్నారు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాసాయిపేట బస్సు ప్రమాదంపై సాక్షి ప్రత్యేక కథనం. సాక్షి, మెదక్: మాసాయిపేట బస్సు ప్రమాదానికి నేటికి ఆరేళ్లు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే గేట్ వద్ద ఆరేళ్ల క్రితం ఇదే రోజు పాఠశాలకు బయల్దేరిన చిన్నారులను బస్సు ప్రమాదం బలితీసుకుంది. మాసాయిపేట కాపలా లేని రైల్వే గేటు వద్ద 34 మంది విద్యార్థులతో వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సు అకస్మాత్తుగా రైలు పట్టాలపై ఆగిపోయింది. అంతలోనే నిజామాబాద్ నుంచి అతి వేగంగా వచ్చిన నాందేడ్ రైలు ఢీకొని బస్సులో ఉన్న విద్యార్థుల్లో 13 మంది చిన్నారులు అక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మరో 18 మంది చిన్నారులు ప్రభుత్వ చొరవతో కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం పొంది ప్రాణాలతో బయటపడ్డారు. (చదవండి: చైనాలో బస్సు ప్రమాదం..21 మంది మృతి) కానీ ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారుల్లో కొందరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జ్ఞాపక శక్తి మందగించి కొందరు, కాళ్లు చేతులు వణకడం సమస్యలతో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చదువుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు అకాల మృత్యువాత పడటంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వాలు ఎంత పరిహారం ఇచ్చినా తమ పేగు బంధం తెగిపోయిందని, ఇది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని చెప్తున్నారు. తమలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని కోరుకుంటున్నారు. దేశంలో ఎక్కడ కాపలా లేని రైల్వే గేట్లు ఉండరాదని కోరుకుంటున్నారు. (చిన్న సాయం చేయండి.. తేజ్‌దీప్‌ను కాపాడండి) -
30 రోజుల్లో మళ్లీ వస్తా
యాదగిరిగుట్ట (ఆలేరు) : ‘గ్రామాల ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రోజుకో గ్రామాన్ని సందర్శిస్తున్నా...ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామాన్ని ఎంపిక చేశారు... కానీ అనుకున్న రీతిలో సర్పంచ్, ఎంపీటీసీ పని చేయలేదు....కలెక్టర్, ఎమ్మెల్యే ఈ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్ధం కావడం లేదు...30 రోజుల్లో మళ్లీ వస్తా...అప్పటిలోగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మాసాయిపేటలో రూ.రెండు కోట్ల లక్షా 60 వేలతో నిర్మించనున్న 40 డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేసి, 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఆదివారం నీళ్లు విడుదల చేస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధికి కేసీఆర్ సంవత్సరానికి రూ.39లక్షలు విడుదల చేస్తున్నారని, ప్రస్తుతం రూ.5 లక్షలు వచ్చాయని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి కార్యక్రమం సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరగాలని, ప్రతి మూడు నెలలకోసారి గ్రామసభలు నిర్వహించుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని కోరారు. గ్రామాభివృద్ధికి సహకరించిన వారికే ప్రశ్నించే హక్కు ఉందన్నారు. ఇంటి ముందు చెత్త వేస్తే రూ. 500, బహిరంగ మలవిసర్జన చేస్తే రూ.1000, ఇంటి వద్ద, బావి వద్ద అనుమతి లేకుండా చెట్లు నరికితే రూ.3 వేలు, మొక్కను నాటిన తర్వాత సంరక్షణ లేకుంటే రూ.200 జరిమానా విధిస్తామన్నారు. ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్తకు సంబంధించిన బుట్టలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్క రోజు శ్రమదానంలో పాల్గొన్న 54 మంది మహిళలకు శ్రీనిధి రుణాల ద్వారా రూ.50 వేల నుంచి రూ.3లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్పంచ్‌లకు దేశంలోనే గొప్ప అవకాశాలు కల్పించారని తెలిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ అనితారాంచంద్రన్, జేసీ రమేష్, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, ఆర్టీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ చీర శ్రీశైలం, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, వైస్ ఎంపీపీ ననబోలు ప్రసన్నరెడ్డి, సర్పంచ్ వంటేరు సువర్ణ ఇంద్రారెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ ఎంపీడీఓ పైళ్ల జయప్రకాష్‌రెడ్డి, ఉపసర్పంచ్ వాకిటి అమృత, కో ఆప్షన్ సభ్యులు యాకూబ్, టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు భారతమ్మ, వ్యాపారవేత్త వంటేరు సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
మాసాయిపేటలో విషజ్వరాలు
వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న ఓ వాడలో విష జ్వరాలు సోకి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజుల నుంచి కొందరు మంచాన పడగా మరి కొందరు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కొంత మంది పేద రోగులు మంచాన పడి మూలుగుతున్నారు. దోమల కాటు వల్ల డెంగీ తదితర జ్వరాలు సోకాయని బాధితులు తెలిపారు. వాడలో ఇంటింటికీ గొర్ల కొట్టాలు ఉండడంతో పేడ, మురుగు వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణలో అధికారులు అశ్రద్ధ చేస్తున్నారని, రోగాల బారినపడిన వారికి సర్కారు వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. 15 రోజుల క్రితం సాయిప్రియ, శ్రీకాంత్, సుశీల, కవిత తదితరులకు విష జ్వరాలు సోకడంతో నగరంలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకొని వచ్చారు. అలాగే నందిని, నవీన, మౌనిక, మోక్షిత తదితరులు రోగాల బారిన పడి నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాప వైద్యానికి రూ.30 వేలు ఖర్చు మా ఐదేళ్ల కూతురు సాయిప్రియకు 15 రోజుల క్రితం జ్వరం వచ్చింది. తగ్గక పోవడంతో టెస్టులు చేయించాం. రక్తంలో తెల్ల కణాలు తగ్గాయని, దీంతో డెంగీ సోకిందని డాక్టర్లు చెప్పారు. దీంతో హైదరాబాద్‌లోని సనత్‌నగర్ వద్ద సెయింట్ థెరిసా ఆసుపత్రిలో వైద్యం చేయించాం. అప్పు చేసి రూ. 30వేలు ఖర్చు చేశాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. - లలిత మనవరాలు ఆసుపత్రిలోనే ఉంది నామనవరాలు సరితకు జ్వరం వచ్చింది. పది రోజుల నుంచి పట్నంలోని ఆస్పత్రిలో ఉంది. ఇప్పటివరకు రూ. 20వేలు ఖర్చయ్యాయి. డెంగీ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. - కమలమ్మ మళ్లీ జ్వరం వస్తోంది నా కూతురు కవితకు పక్షం రోజుల క్రితం జ్వరం వచ్చింది. తూప్రాన్‌లో టెస్టులు తీసుకుంటే డెంగీ సోకిందని చెప్పిండ్రు. పట్నం తీసుకెళ్లి రూ. 25 వేలు ఖర్చు చేసి నయం చేయించి ఇంటికి వచ్చాం. మళ్లీ సాయంత్రం పూట చలి, జ్వరం రావడంతో మూలుగుతోంది. - లక్ష్మి -
చిన్నారులకు కన్నీటి నివాళి
రైలు ప్రమాదానికి రెండేళ్లు తోబుట్టువుల జ్ఞాపకాలతో తల్లడిల్లుతున్న చిన్నారులు విద్యార్థుల ఆత్మశాంతి కోసం ర్యాలీ తరలివచ్చిన తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు వెల్దుర్తి : మండలంలోని మాసాయిపేట జాతీయ రహదారి పక్కనే ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఘోర రైలు దుర్ఘటనలో అసువులు బాసిన ముక్కు పచ్చలారని చిన్నారులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బందువులు, ప్రజాప్రతినిధులు నాయకులు, ప్రజలు, కన్నీటి పర్యంతమై నివాళులర్పించారు. దుర్ఘటనా స్థలం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన చిన్నారుల చిత్రపటాలకు పూల మాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. సరిగ్గా ఇదే రోజు 2014 జూలై 24న ఓ ప్రైవేటు స్కూలు బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారులు రైలు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటనలో తూప్రా¯ŒS మండలం ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన 16 మంది ముక్కుపచ్చలారని చిన్నారులు బలి కాగా మరో 5 మంది చిన్నారులు గాయాల పాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ దుర్ఘటన యావత్ భారతావనిని కలచి వేసింది. ఆదివారం నాటికి సరిగ్గా రెండేళ్లు కావడంతో చిన్నారుల ద్వితీయ వర్దంతిని జరుపుకున్నారు. చిన్నారుల ఆత్మలకు శాంతి కలుగాలని గ్రామ చావిడి నుండి సర్పంచ్ మధుసూద¯ŒSరెడ్డి, ఎంపీటీసి సిద్దిరాంలుగౌడ్, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకుడు యాదగిరి, మాజీ సర్పంచ్ నాగరాజు, సొసైటీ డైరెక్టర్ నర్సింలు, శ్రీనివాస్‌గుప్త, దుర్గస్వామిలతో పాటు పలువురు శాంతి ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్నారుల చిత్రపటాలకు పూల మాలలు వేసి అగరొత్తులు వెలిగించి కన్నీటితో నివాళులు అర్పించి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. నాటి దుర్ఘటనను గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు, సోదరీసోదరుల రోదనలు అక్కడికి వచ్చిన వారందరి హృదయాలను కలచి వేసింది. అవార్డు వచ్చినా ఆనందం లేదు నాటి రైలు దుర్ఘటనలో నా చెల్లి శృతి నాకళ్ల ముందే బలైంది. రైలు స్పీడుగా వస్తుండడంతో బస్సులో ఉన్న మేం అరుస్తూ నా తమ్ముడు అరుణ్‌ను కిటికీ నుండి బయటకు తోసేశా. నాచెల్లి శృతిని తోసే క్రమంలో వీలుకాలేదు. రైలు ఢీకొనే సమయంలోనే నేను బయట పడ్డా. కళ్లు తెరచి చూసేలోగా ఆసుపత్రిలో ఉన్నా. తరువాత తెలిసింది నా చెల్లి శృతి చనిపోయిందని. తమ్ముడు అరుణ్ ఆసుపత్రిలోనే ఉన్నాడని చాలా మంది చెప్పారు. చిన్ననాటి నా చెల్లి చిలిపి తనాలు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తరపున గత జనవరి 16న ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రులు సాహస బాలికల అవార్డు ఇచ్చినా చెల్లి శృతిని కాపాడుకోలేక ఆనందం లేకుండా పోయింది. – చిన్నారి రుచిత చెల్లి, తమ్ముడు లేక బాధగా ఉంది రైలు ప్రమాదంలో నాచెల్లి దివ్య, తమ్ముడు చరణ్‌లు చనిపోయారు. రైలు వస్తుండగా నేను నా తమ్ముడు, చెల్లెలు అరిచాం. అంతలోనే రైలు ఢీకొంది. ఏమైందో ఏమోకాని కొన్ని రోజుల తరువాత ఆసుపత్రి నుండి ఇంటికి వస్తే తమ్ముడు, చెల్లి కనిపించలేదు. కొన్ని రోజుల తరువాత గుర్తుకు వచ్చింది. ఆ రోజు జరిగిన రైలు ప్రమాదంలో నాకు దెబ్బలు తగిలాయని, తమ్ముడు, చెల్లి చనిపోయారని తెలిసింది. వారు లేక నాకు బాధగా ఉంది. ముగ్గురం స్కూలుకు పోతుంటే అల్లరి చేసే వాళ్లం. ఇప్పుడు మూగదానిలా నేనొక్కదాన్నే స్కూలుకు పోతున్నా. – చిన్నారి త్రిష