సంఘటనా స్థలం వద్ద నివాళులర్పిస్తున్న ప్రజాప్రతినిధులు
- రైలు ప్రమాదానికి రెండేళ్లు
- తోబుట్టువుల జ్ఞాపకాలతో తల్లడిల్లుతున్న చిన్నారులు
- విద్యార్థుల ఆత్మశాంతి కోసం ర్యాలీ
- తరలివచ్చిన తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు
వెల్దుర్తి : మండలంలోని మాసాయిపేట జాతీయ రహదారి పక్కనే ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఘోర రైలు దుర్ఘటనలో అసువులు బాసిన ముక్కు పచ్చలారని చిన్నారులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బందువులు, ప్రజాప్రతినిధులు నాయకులు, ప్రజలు, కన్నీటి పర్యంతమై నివాళులర్పించారు.
దుర్ఘటనా స్థలం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన చిన్నారుల చిత్రపటాలకు పూల మాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. సరిగ్గా ఇదే రోజు 2014 జూలై 24న ఓ ప్రైవేటు స్కూలు బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారులు రైలు ప్రమాదంలో మరణించారు.
ఈ దుర్ఘటనలో తూప్రా¯ŒS మండలం ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన 16 మంది ముక్కుపచ్చలారని చిన్నారులు బలి కాగా మరో 5 మంది చిన్నారులు గాయాల పాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ దుర్ఘటన యావత్ భారతావనిని కలచి వేసింది. ఆదివారం నాటికి సరిగ్గా రెండేళ్లు కావడంతో చిన్నారుల ద్వితీయ వర్దంతిని జరుపుకున్నారు.
చిన్నారుల ఆత్మలకు శాంతి కలుగాలని గ్రామ చావిడి నుండి సర్పంచ్ మధుసూద¯ŒSరెడ్డి, ఎంపీటీసి సిద్దిరాంలుగౌడ్, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకుడు యాదగిరి, మాజీ సర్పంచ్ నాగరాజు, సొసైటీ డైరెక్టర్ నర్సింలు, శ్రీనివాస్‌గుప్త, దుర్గస్వామిలతో పాటు పలువురు శాంతి ర్యాలీ నిర్వహించారు.
అక్కడ ఏర్పాటు చేసిన చిన్నారుల చిత్రపటాలకు పూల మాలలు వేసి అగరొత్తులు వెలిగించి కన్నీటితో నివాళులు అర్పించి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. నాటి దుర్ఘటనను గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు, సోదరీసోదరుల రోదనలు అక్కడికి వచ్చిన వారందరి హృదయాలను కలచి వేసింది.
అవార్డు వచ్చినా ఆనందం లేదు
నాటి రైలు దుర్ఘటనలో నా చెల్లి శృతి నాకళ్ల ముందే బలైంది. రైలు స్పీడుగా వస్తుండడంతో బస్సులో ఉన్న మేం అరుస్తూ నా తమ్ముడు అరుణ్‌ను కిటికీ నుండి బయటకు తోసేశా. నాచెల్లి శృతిని తోసే క్రమంలో వీలుకాలేదు. రైలు ఢీకొనే సమయంలోనే నేను బయట పడ్డా. కళ్లు తెరచి చూసేలోగా ఆసుపత్రిలో ఉన్నా.
తరువాత తెలిసింది నా చెల్లి శృతి చనిపోయిందని. తమ్ముడు అరుణ్ ఆసుపత్రిలోనే ఉన్నాడని చాలా మంది చెప్పారు. చిన్ననాటి నా చెల్లి చిలిపి తనాలు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తరపున గత జనవరి 16న ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రులు సాహస బాలికల అవార్డు ఇచ్చినా చెల్లి శృతిని కాపాడుకోలేక ఆనందం లేకుండా పోయింది. – చిన్నారి రుచిత
చెల్లి, తమ్ముడు లేక బాధగా ఉంది
రైలు ప్రమాదంలో నాచెల్లి దివ్య, తమ్ముడు చరణ్‌లు చనిపోయారు. రైలు వస్తుండగా నేను నా తమ్ముడు, చెల్లెలు అరిచాం. అంతలోనే రైలు ఢీకొంది. ఏమైందో ఏమోకాని కొన్ని రోజుల తరువాత ఆసుపత్రి నుండి ఇంటికి వస్తే తమ్ముడు, చెల్లి కనిపించలేదు. కొన్ని రోజుల తరువాత గుర్తుకు వచ్చింది.
ఆ రోజు జరిగిన రైలు ప్రమాదంలో నాకు దెబ్బలు తగిలాయని, తమ్ముడు, చెల్లి చనిపోయారని తెలిసింది. వారు లేక నాకు బాధగా ఉంది. ముగ్గురం స్కూలుకు పోతుంటే అల్లరి చేసే వాళ్లం. ఇప్పుడు మూగదానిలా నేనొక్కదాన్నే స్కూలుకు పోతున్నా. – చిన్నారి త్రిష