30 రోజుల్లో మళ్లీ వస్తా | Minister Errabelli Dayakar Rao Participating in the Masaipet Village Development Program | Sakshi
Sakshi News home page

30 రోజుల్లో మళ్లీ వస్తా

Published Sat, Sep 21 2019 9:46 AM | Last Updated on Sat, Sep 21 2019 9:46 AM

Minister Errabelli Dayakar Rao Participating in the Masaipet Village Development Program - Sakshi

డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి దయాకర్‌రావు

యాదగిరిగుట్ట (ఆలేరు) : ‘గ్రామాల ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రోజుకో గ్రామాన్ని సందర్శిస్తున్నా...ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామాన్ని ఎంపిక చేశారు... కానీ అనుకున్న రీతిలో సర్పంచ్, ఎంపీటీసీ పని చేయలేదు....కలెక్టర్, ఎమ్మెల్యే ఈ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్ధం కావడం లేదు...30 రోజుల్లో మళ్లీ వస్తా...అప్పటిలోగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మాసాయిపేటలో రూ.రెండు కోట్ల లక్షా 60 వేలతో   నిర్మించనున్న 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు శంకుస్థాపన చేసి, 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఆదివారం నీళ్లు విడుదల చేస్తానని తెలిపారు.

గ్రామాభివృద్ధికి కేసీఆర్‌ సంవత్సరానికి రూ.39లక్షలు విడుదల చేస్తున్నారని, ప్రస్తుతం రూ.5 లక్షలు వచ్చాయని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి కార్యక్రమం సర్పంచ్‌ ఆధ్వర్యంలోనే జరగాలని, ప్రతి మూడు నెలలకోసారి గ్రామసభలు నిర్వహించుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని కోరారు. గ్రామాభివృద్ధికి సహకరించిన వారికే ప్రశ్నించే హక్కు ఉందన్నారు. ఇంటి ముందు చెత్త వేస్తే రూ. 500, బహిరంగ మలవిసర్జన చేస్తే రూ.1000, ఇంటి వద్ద, బావి వద్ద అనుమతి లేకుండా చెట్లు నరికితే రూ.3 వేలు, మొక్కను నాటిన తర్వాత సంరక్షణ లేకుంటే రూ.200 జరిమానా విధిస్తామన్నారు. ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్తకు సంబంధించిన బుట్టలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్క రోజు శ్రమదానంలో పాల్గొన్న 54 మంది మహిళలకు శ్రీనిధి రుణాల ద్వారా రూ.50 వేల నుంచి రూ.3లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించారు.

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సర్పంచ్‌లకు దేశంలోనే గొప్ప అవకాశాలు కల్పించారని తెలిపారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ అనితారాంచంద్రన్, జేసీ రమేష్, డీఆర్‌డీఓ ఉపేందర్‌రెడ్డి, ఆర్టీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బీకూనాయక్, ఎంపీపీ చీర శ్రీశైలం, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, వైస్‌ ఎంపీపీ ననబోలు ప్రసన్నరెడ్డి, సర్పంచ్‌ వంటేరు సువర్ణ ఇంద్రారెడ్డి, జిల్లా కో ఆప్షన్‌ సభ్యులు ఖలీల్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌ ఎంపీడీఓ పైళ్ల జయప్రకాష్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ వాకిటి అమృత, కో ఆప్షన్‌ సభ్యులు యాకూబ్, టీఆర్‌ఎస్‌ మహిళ అధ్యక్షురాలు భారతమ్మ, వ్యాపారవేత్త వంటేరు సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement