కత్తితో బెదిరించి...
కర్నూలు : నగర శివారుల్లోని మాసమసీదు వద్ద గురువారం అర్ధరాత్రి కత్తితో బెదిరించి ఓ రైతు వద్ద నుంచి దుండగులు డబ్బులు లాక్కొని ఉడాయించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. జి.సింగవరం గ్రామానికి చెందిన నాగన్న అనే రైతు మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని మున్సిపల్ ఆఫీసు వద్ద స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో కోసం వేచి ఉన్నాడు. ముగ్గురు యువకులు కూడబలుక్కొని అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్లాలంటూ నాగన్నను మాటల్లో పెట్టారు. తాము కూడా సింగవరానికి వెళ్తున్నామని నమ్మించి, ఆటోలో ఎక్కించుకొని నగర శివారుల్లోని వాగు వద్ద తుంగభద్రనది వైపు ఆటోలో తీసుకెళ్లి అరవకుండా నోటికి బట్టకట్టి దాడి చేసి గాయపరిచారు. రైతు ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా కత్తితో బెదిరించి అడ్డపంచతో పాటు డబ్బులు లాక్కున్నారు. రైతు కేకలు వేసుకుంటూ డ్రాయర్తో మెయిన్ రోడ్డుకు పరిగెత్తి మునగాలపాడుకు నడుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బైక్ తెప్పించుకొని స్వగ్రామానికి చేరుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బెదిరించారని బాధితుడు సాక్షితో తన గోడును చెప్పుకున్నాడు.