mason
-
గుంపు మేస్త్రీకి 1.37 లక్షల శాలరీ ఆఫర్!
దారిద్ర్యంలో మగ్గిపోతున్న వ్యక్తికి ఒక్కసారిగా లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం లభిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఊహకందని ఆఫర్ బీహార్ గుంపు మేస్త్రీకి దక్కింది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇజ్రాయెల్‌లో గత కొన్ని నెలలుగా హమాస్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా పలు భవనాలు శిధిలమయ్యాయి. తిరిగి భవనాలను నిర్మించేందుకు ఇజ్రాయెల్‌కు నిర్మాణ కార్మికుల అవసరం ఎంతో ఉంది. దీనిలో భాగంగానే కార్మికుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా భవన నిర్మాణపు పనుల్లో పాల్గొనే కార్మికులకు డిమాండ్ అధికంగా ఉంది. అర్హతను అనుసరించి గుంపు మేస్త్రీలను రూ. 1.37 లక్షల వేతనంతో నియమించుకుంటున్నారు. ఇలా నియమితులైనవారు ఏడాది నుంచి ఐదు సంవత్సరాల పాటు అక్కడ పనులు చేయాల్సి ఉంటుంది. బీహార్‌లోని చాప్రా నివాసి జితేంద్ర కుమార్ రాయ్ అనే తాపీ మేస్త్రీకి ఇజ్రాయెల్‌లో పనిచేసే అవకాశం దొరికింది. పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన జితేంద్ర చిన్నప్పటి నుంచి సైనికునిగా మారాలని కలలుగనేవాడు. అతనికి తగిన పని దొరక్కపోవడంతో తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. గుంపు మేస్త్రీగా ధృవీకరణ పత్రం పొందేందుకు జంషెడ్‌పూర్‌లోని నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశాడు. ప్రస్తుతం జితేంద్ర బీహార్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రతీనెలా రూ.20 వేల వరకూ సంపాదిస్తుంటాడు. ఇజ్రాయెల్ వెళ్లే అవకాశం రాగానే జితేంద్ర ఎగిరిగంతేశాడు. తమ కుటుంబం ఇన్నాళ్లూ అనుభవించిన పేదరికం ఇక పటాపంచలైపోతుందని జితేంద్ర ఆశాభావం వ్యక్తం చేశాడు. -
నందిరెడ్డిగారిపల్లె ప్రత్యేకత ఏంటో తెలుసా!
కురబలకోట(అన్నమయ్య జిల్లా) : ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బేల్దార్లు (తాపీ మేస్త్రీలు), భవన నిర్మాణ కార్మికులున్న ఊరుగా కురబలకోట మండలంలోని నందిరెడ్డిగారిపల్లె పెట్టింది పేరు. ఇది కష్టజీవుల ఊరు. ఏ ఇంట్లో చూసినా తాపీ, గజం కట్టి, టేపు, మూల మట్టం కన్పిస్తాయి. వీరు కూడా అంతా ముస్లిం మైనార్టీలే. 40 ఏళ్ల క్రితం తొలుత ఆ ఊరికి చెందిన షేక్ నూరాసాబ్ ఈ వృత్తికి ఆద్యులుగా చెబుతారు. ఆ తర్వాత దర్గా ఖాదర్‌వల్లీ ఈ వృత్తిని స్వీకరించడంతో అతని వద్ద మరికొందరు బేల్దార్లు, మేస్త్రీలు తయారయ్యారు. ఇలా ఒక్కరొక్కరుగా పనికి వెళుతూ మిగిలిన వారు కూడా కాలక్రమంలో బేల్దార్లు అయ్యారు. ఇప్పుడు ఆ ఊరిలో 75 శాతం మందికి ఇదే జీవనాధారం. ఈ వృత్తినే పరంపరగా సాగిస్తున్నారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు కూడా బేల్దార్లు ఉన్నారు. చేతిపని కావడంతో వచ్చే ఆదాయం ఇళ్లు గడవడం ఇతర అత్యవసరాలు తీరడానికి సరిపోతోందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పనికి బయలు దేరి సాయంత్రం ఐదు గంటల వరకు పనులు చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. మంగళవారం మదనపల్లె సంత కావడంతో సెలవు తీసుకుంటారు. ఈ ఊరిలో 2221 జనాభా, 621 కుటుంబాలు, 1063 మంది ఓటర్లు ఉన్నారు. 90 శాతం అక్షరాస్యత ఉంది. ఈ ఊరి తర్వాత మండలంలోని సింగన్నగారిపల్లె, పందివానిపెంట కూడా భవన నిర్మాణ కార్మికులకు పెట్టింది పేరు. మదనపల్లె, కురబలకోట పరిసర ప్రాంతాలకు వీరు పనులకు వెళతారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి వీరికోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. (క్లిక్: చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట) యువతరం చదువులపై దృష్టి నేటి తరం చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ వృత్తి పట్ల యువకులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ ఉర్దూ యూపీ స్కూల్ ఉంది. ఈ ఊరిలో సచివాలయం కూడా ఉంది. వెనుకబడిన ఆ ఊరు ఇప్పుడిప్పుడే వివిధ ప్రభుత్వ పథకాలతో క్రమేణా పేదరికం నుంచి బయటపడుతోంది. భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్లు కట్టుకున్నాం. మా ఇళ్లను మేమే ఉన్నంతలో సంతోషంగా కట్టుకుంటాం. – మోదీన్ సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకాలేదు ఈ వృత్తితో ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకా లేదు. కట్టడాలు, భవన నిర్మాణాలు నిరంతరం జరుగుతుంటాయి. పని లేదన్న చింత లేదు. సీఎం జగన్ ప్రభుత్వంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ భవనాలు, జగనన్న ఇళ్లు లాంటి తదితర ఎన్నో అభివృద్ధి పనుల వల్ల రెండు చేతులా తరగని పని ఉంది. కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ వచ్చింది. యంత్రాల సాయంతో పని కూడా సులభతరంగా మారింది. తాపీనే మాకు పెట్టుబడి.. ఆపై జీవనాధారం. ఖర్చులు పోను నెలకు రూ. 20 వేలు వరకు మిగులుతుంది. – కమాల్‌సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె అభివృద్ధి బాటపడుతోంది ఈ ఊరు దశాబ్దాలుగా పేదరికాన్ని అనుభవించింది. సచివాలయాలు రాక మునుపు సరైన రోడ్డు లేదు. వీధులు సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు పక్కా రోడ్డు ఉంది. పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. పింఛన్లు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. 31 డ్వాక్రా గ్రూపులు ఉండగా వాటి ద్వారా రూ. 3 కోట్లు టర్నోవర్ ఉంది. డబ్బుకు ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సిన పనిలేదు. ఈ ఊరు మదనపల్లె పట్టణానికి సమీపంలోనే ఉంది. ఇది కూడా వీరికి కలసి వచ్చింది – సఫియా, గ్రామ కార్యదర్శి, నందిరెడ్డిగారిపల్లె నాడు రూ. రెండున్నర.. నేడు రూ.800 మేము పనిచేసే తొలి నాళ్లలో బేల్దార్లకు రోజుకు రెండున్నర రూపాయి ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉంది. గుర్తుంపు కార్డులు ఇచ్చారు. వాటి అవసరం పెద్దగా ఏర్పడ లేదు. అల్లా దయవల్ల ప్రమాదకర ఘటనల బారిన పడలేదు. సత్తువ, శక్తి ఉన్నన్నాళ్లు ఈ పని చేసుకోవచ్చు. ఎప్పటికీ డిమాండు ఉంటుంది. – హైదర్‌వల్లీ, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె -
ట్రంప్‌కి ఇంగ్లిష్ రాదా..!
న్యూయార్క్: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..! అక్షరాల కూర్పులో తప్పులు దొర్లితే అమెరికా అధ్యక్షుడి ఉత్తరమైనా దానిపై టీచర్ పెన్ను పడాల్సిందే..! విషయమేంటంటే.. ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని పాఠశాలపై ఫిబ్రవరిలో నికోలజ్ క్రూజ్ అనే ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 17 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని అట్లాంటాలో నివాసముంటే వ్యోన్ మాసోన్(61) అనే రిటైర్డ్ టీచర్ కొన్నాళ్ల క్రితం దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఆమె ఉత్తరంపై స్పందించిన వైట్‌హౌస్ కార్యాలయం ట్రంప్ పేరుతో మాసోన్కు ప్రత్యుత్తరం రాసింది. ‘విద్యార్థుల భద్రత, బాధిత కుటుంబాల సంక్షేమంపై మీ సూచనలకు ధన్యవాదాలు. త్వరలోనే అన్ని వర్గాల మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వైట్ హౌస్‌లో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామ’ని లెటర్లో పేర్కొన్నారు. అయితే, సదరు ఉత్తరం తప్పుల తడకగా ఉండడంతో ఇంగ్లిష్ టీచర్ మాసోన్కు చిర్రెత్తుకొచ్చింది. లేఖలోని దోషాలను సరిచేయకుండా ఆమె ఉండలేక పోయారు. అందులోని గ్రామర్, ఉచ్చారణ దోషాలను సరిదిద్ది ఆ లేఖను తిరిగి వైట్ హౌస్‌కు పంపారు. ఉత్తరం పైభాగాన ‘గ్రామర్, శైలికి సంబంధించి మీరు చెక్ చేశారా?’ అని మాసోన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘లేఖలోని భాషాంశాలు మరీ పేలవంగా ఉన్నాయి. పొరపాట్లు సహజం. నాకు తెలిసినంత వరకు చేశాను’ అని మాసోన్ తన ఫేస్బుక్ అకౌంట్లో ఆ లెటర్ కాపీని షేర్ చేశారు. అయితే ‘ఓ మై గాడ్’, ‘యూ ఆల్’ అంటూ ఆమె ఉత్తరంలో ఆశ్చర్యం వ్యక్తం చేయడాన్ని కొందరు తప్పుబట్టారు. -
రాత్రికి రాత్రే తాపీ మేస్త్రి అకౌంట్లోకి భారీ నగదు!
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తెలియకుండానే అకౌంట్లలోకి భారీగా నగదు వచ్చి పడుతోంది. ముంబైలో పనిచేస్తున్న ఓ ఉత్తరప్రదేశ్ తాపీ మేస్త్రీ అకౌంట్లోకి ఏకంగా రూ.62లక్షలకు పైగా నగదు రాత్రికి రాత్రే జమైంది. అంతకుముందు అతని అకౌంట్లో కేవలం రూ.7,528 మాత్రమే ఉండేవి. కానీ ఒక్కసారిగా ఇంత నగదు వచ్చి చేరడంతో, ప్రస్తుతం ఆ అకౌంట్‌ను బ్లాక్ చేశారు. ఆ నగదును ఎవరు డిపాజిట్ చేశారన్నది మాత్రం ఇంకాతెలియదు. వివరాలోకి వెళ్తే.. అజయ్ కుమార్ పటేల్ దాదాపు 15ఏళ్లుగా ముంబైలో నలసోపురాలో తాపి పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా అతను స్వగ్రామం ప్రతాప్‌ఘర్ జిల్లా సరాయ్ హరి నారాయణ్‌లోని తన ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన అతని అకౌంట్లోకి, పెద్దనోట్ల రద్దు అనంతరం భారీగా నగదు వచ్చి చేరింది. సోమవారం ఉదయం అతనికి తన అకౌంట్లోకి నగదు డిపాజిట్ అయినట్టు ఓ మెసేజ్ వచ్చింది. కానీ అతను ఏవో కంపెనీలు పంపించే మెసేజస్ అనుకుని ఓపెన్ చేసి చూడలేదు. స్వగ్రామం నుంచి ముంబైకు తిరుగు ప్రయాణం కావడానికి పటేల్ టిక్కెట్ బుక్ చేసుకోవడానికి బాబాగంజ్, ప్రతాప్‌ఘర్ రావాల్సి ఉంది. కానీ అక్కడికి రావడానికి సరిపడ నగదు లేకపోవడంతో, తమ గ్రామ పెద్ద చంఛల్ సింగ్ నుంచి రూ.200 అప్పుగా తీసుకుని బాబాగంజ్ వెళ్లాడు. అక్కడ ఏటీఎం నుంచి తన అకౌంట్లో అంతకముందు ఉన్న నగదును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో తన అకౌంట్ బ్లాక్ అయిందని పటేల్‌కు కనపడింది. దీంతో కంగారుపడిన పటేల్‌కు సోమవారం రోజు ఫోన్‌కు వచ్చిన మెసేజ్ గుర్తువచ్చింది. వెంటనే తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను మరోసారి తరువుగా చదివాడు. రూ.62లక్షలకు పైగా నగదు అకౌంట్లో డిపాజిట్ అయ్యాయని ఆ మెసేజ్‌లో ఉన్నట్టు పటేల్ పేర్కొన్నాడు. కానీ ఎవరు వేశారన్నది తెలియరాలేదని తెలిపాడు. నలసోపురా వెస్ట్ బ్రాంచులో కొన్నేళ్ల క్రితమే అతను సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తర్వాత బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి తనకు కాల్ వచ్చిందని, బ్యాంకును వెంటనే సంప్రదించాలని వారు సూచించినట్టు పటేల్ పేర్కొన్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడు తాను స్వస్థలం యూపీలో ఉన్నట్టు ఆఫీసర్‌తో చెప్పానని, దానికి వారు ప్రూఫ్ అడగగా, గ్రామపెద్ద లేదా మెజిస్ట్రేట్‌తో సంతకం చేసిన ఓ లేఖను కూడా బ్యాంకుకు సమర్పించినట్టు పటేల్ చెప్పాడు. ఆ నగదు తనది కాదని బ్యాంకు మేనేజర్‌గా చెప్పానని, ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటే అది చేయమని, కానీ తన అకౌంట్లో ఉన్న తన నగదును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పటేల్ అభ్యర్థించాడు. పటేల్‌కు జరిగిన విషయం విన్న తామందరం చాలా ఆశ్చర్యానికి గురయ్యామని, బ్యాంకు కోరిన వెంటనే తాము లేఖను అందిచామని గ్రామ పెద్ద చంఛల్ సింగ్ పేర్కొన్నారు.