దారిద్ర్యంలో మగ్గిపోతున్న వ్యక్తికి ఒక్కసారిగా లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం లభిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఊహకందని ఆఫర్ బీహార్ గుంపు మేస్త్రీకి దక్కింది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
ఇజ్రాయెల్‌లో గత కొన్ని నెలలుగా హమాస్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా పలు భవనాలు శిధిలమయ్యాయి. తిరిగి భవనాలను నిర్మించేందుకు ఇజ్రాయెల్‌కు నిర్మాణ కార్మికుల అవసరం ఎంతో ఉంది. దీనిలో భాగంగానే కార్మికుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా భవన నిర్మాణపు పనుల్లో పాల్గొనే కార్మికులకు డిమాండ్ అధికంగా ఉంది.
అర్హతను అనుసరించి గుంపు మేస్త్రీలను రూ. 1.37 లక్షల వేతనంతో నియమించుకుంటున్నారు. ఇలా నియమితులైనవారు ఏడాది నుంచి ఐదు సంవత్సరాల పాటు అక్కడ పనులు చేయాల్సి ఉంటుంది. బీహార్‌లోని చాప్రా నివాసి జితేంద్ర కుమార్ రాయ్ అనే తాపీ మేస్త్రీకి ఇజ్రాయెల్‌లో పనిచేసే అవకాశం దొరికింది.
పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన జితేంద్ర చిన్నప్పటి నుంచి సైనికునిగా మారాలని కలలుగనేవాడు. అతనికి తగిన పని దొరక్కపోవడంతో తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు. గుంపు మేస్త్రీగా ధృవీకరణ పత్రం పొందేందుకు జంషెడ్‌పూర్‌లోని నేషనల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఎనిమిది సంవత్సరాలు పనిచేశాడు.
ప్రస్తుతం జితేంద్ర బీహార్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ప్రతీనెలా రూ.20 వేల వరకూ సంపాదిస్తుంటాడు. ఇజ్రాయెల్ వెళ్లే అవకాశం రాగానే జితేంద్ర ఎగిరిగంతేశాడు. తమ కుటుంబం ఇన్నాళ్లూ అనుభవించిన పేదరికం ఇక పటాపంచలైపోతుందని జితేంద్ర ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment