అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)
న్యూయార్క్: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..! అక్షరాల కూర్పులో తప్పులు దొర్లితే అమెరికా అధ్యక్షుడి ఉత్తరమైనా దానిపై టీచర్ పెన్ను పడాల్సిందే..! విషయమేంటంటే.. ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని పాఠశాలపై ఫిబ్రవరిలో నికోలజ్ క్రూజ్ అనే ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 17 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని అట్లాంటాలో నివాసముంటే వ్యోన్ మాసోన్(61) అనే రిటైర్డ్ టీచర్ కొన్నాళ్ల క్రితం దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఆమె ఉత్తరంపై స్పందించిన వైట్‌హౌస్ కార్యాలయం ట్రంప్ పేరుతో మాసోన్‌కు ప్రత్యుత్తరం రాసింది.
‘విద్యార్థుల భద్రత, బాధిత కుటుంబాల సంక్షేమంపై మీ సూచనలకు ధన్యవాదాలు. త్వరలోనే అన్ని వర్గాల మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వైట్ హౌస్‌లో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామ’ని లెటర్‌లో పేర్కొన్నారు. అయితే, సదరు ఉత్తరం తప్పుల తడకగా ఉండడంతో ఇంగ్లిష్ టీచర్ మాసోన్‌కు చిర్రెత్తుకొచ్చింది. లేఖలోని దోషాలను సరిచేయకుండా ఆమె ఉండలేక పోయారు. అందులోని గ్రామర్, ఉచ్చారణ దోషాలను సరిదిద్ది ఆ లేఖను తిరిగి వైట్ హౌస్‌కు పంపారు.
ఉత్తరం పైభాగాన ‘గ్రామర్, శైలికి సంబంధించి మీరు చెక్ చేశారా?’ అని మాసోన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘లేఖలోని భాషాంశాలు మరీ పేలవంగా ఉన్నాయి. పొరపాట్లు సహజం. నాకు తెలిసినంత వరకు చేశాను’ అని మాసోన్ తన ఫేస్‌బుక్ అకౌంట్లో ఆ లెటర్ కాపీని షేర్ చేశారు. అయితే ‘ఓ మై గాడ్’, ‘యూ ఆల్’ అంటూ ఆమె ఉత్తరంలో ఆశ్చర్యం వ్యక్తం చేయడాన్ని కొందరు తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment