Master Sai srivant
-
అప్పూః ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్
ప్రతిరోజూ ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలు... ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడూ ఏదొక హడావుడి! మరి, పిల్లలతో కాస్త సమయం గడిపే వీలుంటుందా? వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే తీరికుందా? అసలు, చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను పెద్దలు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది? పసి వయసులో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం కోరుకుంటారు? అనే సందేశంతో రూపొందిన బాలల సినిమా ‘అప్పూ’. ది క్రేజీ బాయ్.. అనేది ఉపశీర్షిక. మాస్టర్ సాయి శ్రీవంత్ టైటిల్ రోల్లో మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో మోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత కె. మోహన్ మాట్లాడుతూ – ‘‘ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో మా సినిమా ఎంపిక కావడం హ్యాపీగా ఉంది. సాయి శ్రీవంత్తో పాటు బాల తారలు సుమిత్ జాషు, సాయి అభిషేక్, లాస్య, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాంలు నటించారు. యాక్టర్స్ జాకీ, లోహిత్ కుమార్, కావ్య, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి, ఫణి అద్భుతంగా నటించారు. మంచి సందేశంతో అందర్నీ అలరించేలా ఈ సినిమా ఉంటుంది. చిన్నారులతో పాటు తల్లిదండ్రులందరూ చూడాల్సిన చిత్రం’’ అన్నారు. -
కల గన్నావా.. బుజ్జి నాయనా..!
తొమ్మిదేళ్ల బాలుడు అప్పూకి ఏనుగంటే చాలా ఇష్టం. నగర జీవితంలో ఉరుకుల, పరుగుల ఉద్యోగాలు చేస్తూ క్షణం తీరిక లేని అప్పూ తల్లిదండ్రులకు కొడుక్కి ఏనుగుని చూపించే తీరిక ఉండదు. చివరికి, తానే ఏనుగును చూడడానికి స్నేహితులతో కలిసి ఓ అడవిలోకి వెళతాడు అప్పూ. అక్కడ అప్పూ బృందం ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఏనుగుని చూడగలిగారా? అనే అంశాలతో సాగే చిత్రం ‘అప్పూ’. ఉపశీర్షిక ‘ది క్రేజీ బాయ్’. టైటిల్ రోల్‌ను మాస్టర్ సాయి శ్రీవంత్, ముఖ్య పాత్రలను లోహిత్, ఆదిలాబాద్ గిరిజన నాయకుడు జాదవ్ కృష్ణ నాయక్, ఆయన తనయుడు మహేశ్ నాయక్ తదితరులు చేస్తున్నారు. మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై కె. మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను మోహన్ తెలియజేస్తూ -‘‘ఇటీవల ఆదిలాబాద్‌లోని కుంతాల జలపాతం సమీపంలో ‘కలగన్నావా.. బుజ్జి నాయనా..’, ‘ఏంటో కొత్తగా ఉందా ఈ లోకం..’ పాటల్లో కొంత భాగం చిత్రీకరించాం. మిగతా భాగం చిత్రీకరణ 26న మొదలుపెట్టబోతున్నాం. హైదరాబాద్, నర్సాపూర్‌లో జరిపే షెడ్యూల్స్‌తో చిత్రం పూర్తవుతుంది’’ అన్నారు. బండ జ్యోతి, కావ్య, బాల తారలు సాయి అభిషేక్, లాస్య, మేఘన, జాషువా, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాం కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం శ్రీ అందిస్తున్నారు.