కార్టూన్ కప్ప ‘పెప్’కు అంత్యక్రియలు
న్యూయార్క్: ఆన్లైన్ కార్టూన్ క్యారెక్టరైన ‘పెప్’ అనే కప్పకు దాన్ని సష్టికర్త మ్యాట్ ఫ్యూరీ పాడె కట్టారు. అంత్యక్రియలు జరిపారు. ఆయనతోపాటు ఆయన గీసే బాయ్స్ క్లబ్ కార్టూన్ స్ట్రిప్ సభ్యులందరూ కూడా ప్రియమైన పెప్ కప్పకు ఘనంగా నివాళులర్పించారు. 2005 నుంచి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న పెప్‌ను కొంత మంది, ముఖ్యంగా అమెరికాకు చెందిన ‘ఆల్టర్నేటివ్ రైట్ గ్రూప్’కు చెందిన వారు జాతి విద్వేషానికి చిహ్నంగా ఉపయోగిస్తుండడంతో మ్యాట్‌కు కోపం వచ్చింది.
పెప్‌ను దుర్వినియోగం చేయకుండా ఆ క్యారెక్టర్‌ను తన కార్టూన్ సిరీస్ నుంచి శాశ్వతంగా చంపేయాలనుకున్నారు. దానికి సూచకంగా అంత్యక్రియలు జరిపినట్లు తన కార్టూన్ సిరీస్‌లో చూపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ల మధ్య హోరాహోరీ ప్రచారం సందర్భంగా కూడా పెప్ క్యారెక్టర్‌ను దుర్వినియోగం చేశారు. 2015లో డోనాల్డ్ ట్రంప్ ‘పెప్’ గెటప్‌లో ఉండి ‘యూ కాంట్ ది స్టంప్ ది ట్రంప్’ అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ను పెప్ కోరుకుంటోందని ఆయన వర్గీయులు ప్రచారం చేశారు. ఇప్పుడు పెప్‌ను మరీ అడాల్ఫ్ హిట్లర్‌గా కూడా చూపిస్తుండడంతో మ్యాట్ తట్టుకోలేకపోయారు.